ప్రేమ, మానవత్వాల సమ్మేళనం రంజాన్... ఈద్ ముబారక్
మానవతకు పరిపూర్ణ అర్థాన్ని బోధిస్తూ మనిషి ప్రేమమూర్తిగా మనుగడ సాగించాలన్న జీవిత సత్యాన్ని చాటిచెప్పే రంజాన్ పండగ ఎంతో పవిత్రమైంది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడాలన్న ప్రబోధనతో మహమ్మద్ ప్రవక్త మానవాళికి మార్గనిర్దేశం చేసిన మహత్తర సందేశ
మానవతకు పరిపూర్ణ అర్థాన్ని బోధిస్తూ మనిషి ప్రేమమూర్తిగా మనుగడ సాగించాలన్న జీవిత సత్యాన్ని చాటిచెప్పే రంజాన్ పండగ ఎంతో పవిత్రమైంది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడాలన్న ప్రబోధనతో మహమ్మద్ ప్రవక్త మానవాళికి మార్గనిర్దేశం చేసిన మహత్తర సందేశమే రంజాన్ పండగ ఆంతర్యం. ప్రార్థించే పెదవులకన్నా సాయమందించే చేతులే మిన్న అన్న సూక్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచే పండగ ఇది. రంజాన్ పండుగ అసలు పేరు ‘ఈదుల్ ఫితర్’.
ఈ పండుగనే ఉపవాసాల పండుగ, సేమియాల పండుగ, దాన ధర్మాల పండుగ అని కూడా పిలుస్తారు. ఇస్లాం కాలమాన ప్రకారం రంజాన్ అన్నది సంవత్సరంలో తొమ్మిదో నెల. అరబిక్ భాషలో ‘రంజ్’ అంటే కాలుతూ, జ్వలించటం అని అర్థం. ఈ మాసంలో ఉపవాస దీక్షలతో దేహాన్ని శుష్కింపజేయడంతో ఆత్మలోని మలినం ప్రక్షాళనమవుతుంది. సమస్త పాపాలను దహింపజేసే ఈ పండుగకు రంజాన్ అనే పేరువచ్చింది.
నెల పొడవునా ఉపవాస దీక్ష కొనసాగించిన దరిమిలా మాసాంతంలో నెలవంకను దర్శించుకున్న మరుసటి రోజే రంజాన్ పండుగను జరుపుతారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాల్లో, మసీదుల్లో జరుపుకునే నమాజ్ ప్రార్థనలనే ఈదుల్ ఫితర్ ప్రార్థనలు అంటారు. నమాజ్ ప్రార్థనలు ముగిసిన పిమ్మట పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా పరస్పర ఆలింగనం చేసుకుని సంతోషంగా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.