గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By JSK
Last Modified: బుధవారం, 12 అక్టోబరు 2016 (21:54 IST)

ర‌క్తం చిందేలా గుండెలు బాదుకున్న ముస్లిం యువ‌కులు(Video)

మ‌చిలీప‌ట్నం : మొహ‌ర్రం సంద‌ర్భంగా ర‌క్తం చిందించాల‌నేది ముస్లింల ఆన‌వాయితీ. అల్లా త‌మ‌కు మోక్షం క‌లిగిస్తాడ‌నేది వారి న‌మ్మ‌కం. అందుకే మొహరం సందర్భంగా.. కృష్ణా జిల్లా మచిలీపట్టణం కోనేరు సెంటరులో షియా-ముస్లింలు ఇలా ర‌క్తం వ‌చ్చేలా గుండెలు బాదుకున్నార

మ‌చిలీప‌ట్నం : మొహ‌ర్రం సంద‌ర్భంగా ర‌క్తం చిందించాల‌నేది ముస్లింల ఆన‌వాయితీ. అల్లా త‌మ‌కు మోక్షం క‌లిగిస్తాడ‌నేది వారి న‌మ్మ‌కం. అందుకే మొహరం సందర్భంగా.. కృష్ణా జిల్లా మచిలీపట్టణం కోనేరు సెంటరులో షియా-ముస్లింలు ఇలా ర‌క్తం వ‌చ్చేలా గుండెలు బాదుకున్నారు. అల్లాను శ్లాఘిస్తూ, మ‌త ప్రార్థన‌లు చేశారు. ఈ దృశ్యాల‌ను చూసేందుకు తండోప‌తండాలుగా ప్ర‌జ‌లు కోనేరు సెంట‌ర్‌కి చేరుకున్నారు.
 
మొహర్రం అంటే...          
ముహర్రమ్-ఉల్-హరామ్, అని పిలువబడే మొహర్రం, ఇస్లామీయ కేలండర్లోని మొదటి నెల, అంటే ఇస్లామీయ సంవత్సరాది అన్న‌మాట‌. నిజానికి మొహరం ఇస్లాం పూర్వం, అరబ్బులలో సాంప్రదాయకమైన అరబ్బీ కేలండర్ మొదటి నెల. ప్రాచీన కాలంలోని అరబ్బులు (అరేబియాలోని యూదులు మరియు క్రైస్తవులతో సహా) ఈ కేలండర్‌ను వాడేవారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా మొహర్రం పదవ తేదీని, అనేక సాంప్రదాయక గుర్తులకు అనుగుణంగా పర్వంగా, పండుగగా జరుపుకునేవారు. ఇస్లామీయ కేలండర్ వాడుకలోనికి వచ్చిన తరువాత కూడా, ఇది తొలి సంవత్సరాదిగా పండుగగా జరుపుకొనేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. 
 
మరో కోణం నుంచి పరిశీలిస్తే పద్నాలుగు శతాబ్దాల క్రితం హజ్రత్ ము ఆవియా అనే ముస్లిం పాలకుడు ప్రజలే పాలకుడిని ఎన్నుకోవాలనే ఇస్లాం ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని వ్యతిరేకించి తన కుమారుడైన యజీద్‌ను రాజు ప్రకటించాడు. దీనిని అప్పటి ప్రజలు, ధర్మశాస్త్రవేత్తలు అందరూ వ్యతిరేకించారు. రాజ్యాధికారం వారసత్వపు హక్కు కాదని రాజరిక అనువంశిక విధానం ఇస్లామీయ ప్రజాస్వామిక సూత్రాలకే విరుద్ధమని చెప్పిన ఇస్లాం ధర్మశాస్త్రవేత్తల్ని దుష్టుడైన యజీద్ నిర్బంధించాడు. ఇది రాచరిక వ్యవస్థ పునరుథ్థానంగా భావించిన ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుసైన్ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ప్రతిఘటించడానికి సిద్ధపడ్డారు. ప్రవక్త మనుమడైన ఇమామ్ హుసైన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తిరగబడతారని భావించిన యజీద్ కుతంత్రంతో ఇమామ్‌ను హతమార్చాలని యోచిస్తూ చర్చలకు రమ్మని వర్తమానం పంపిస్తాడు. యజీద్ 'కర్బలా' మైదానంలో ఇమామ్ హుసైన్‌ను చంపిస్తాడు. ప్రజలు తిరుగుబాటు చేసి యజీద్ ప్రభుత్వన్ని కూలదోస్తారు.
 
ఆషూరా
ముహమ్మద్ ప్రవక్త మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ, కర్బలా యుద్ధంలో, మొహర్రం పదవ రోజైన ఆషూరా నాడు అమరుడైన తరువాత, మొహర్రం నెలను, "షహీద్ " (అమరవీరుల) నెలగా వర్ణిస్తూ, పండుగగా జరుపుకొనడం మానేసారు. మొహర్రం, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ మొహర్రం నెల "ఆషూరా", కర్బలా యుద్ధం లో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. మాతమ్(శోక ప్రకటన) జరుపుతారు. షియాలు ఎక్కువగా ఉన్నచోట్ల, ఉదాహరణకు లక్నో మరియు హైదరాబాదు లాంటి చోట్ల, మొహర్రం పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
 
పీర్ల పండుగ
ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. ఏటా కోట్ల మంది షియా, సున్నీ ముస్లిములు హజ్రత్‌ ఇమామ్‌ హుసైన్‌ అమర త్యాగానికి నివాళులర్పిస్తారు. మొహర్రం ఇస్లామ్‌ చరిత్రలో విషాద అధ్యాయం. ఈ విషాద దినాల్లో షియాలు 'మాతమ్‌' చేస్తారు. అంటే, లయబద్ధంగా చేతులతో రొమ్ముల్ని బాదుకొంటారు. మాతమ్‌లో శత్రువులతో పోరాడిన ధర్మవీరుల శౌర్యాన్ని వ్యక్తం చేసే పాటలు ఆలపిస్తారు. అందులో ఆధ్యాత్మికత నిక్షిప్తమై ఉంటుంది. మొహర్రం జరిగే పదిరోజులు పర్వదినాలు కావు. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.
 
లోకంలో తరాలు అంతర్ధానమవుతుంటాయి. మనుషులూ నిష్క్రమిస్తారు. తమస్సు నిండిన ప్రపంచానికి త్యాగపురుషుల జీవితాలు మాత్రం దీపాలై వెలుగుతుంటాయి. ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక భావజాలంపై ఇస్లామ్‌కు ఆది నుంచి దృఢమైన విశ్వాసముంది. ప్రజల్లోని రుగ్మతల్ని పారద్రోలడం ప్రధాన లక్ష్యంగా భావించే ఇస్లామ్‌ రాక్షసత్వాన్ని రూపుమాపి మానవత్వానికి జీవం పోయడంలో ప్రాణార్పణకైనా వెనుకాడదనే మహోన్నత అంశానికి తార్కాణంగా నిలిచింది మొహర్రం. మొహర్రం, పేరు వినగానే సహజంగా ముస్లిములకే కాదు, ముస్లిమేతరులకు సైతం ఇమామ్‌హుసైన్‌(రజి) స్మరణకు వస్తారు. మొహర్రం జాతీయ సమైక్యతకు ప్రతీకగా జనుల హృదయాల్లో చోటు సంపాదించుకొంది. సాధారణంగా సత్యం, న్యాయం పదం మోపిన చోట అసత్యం, అన్యాయం రంగప్రవేశం చేస్తాయి. కుయుక్తులు, కుటిల బుద్ధులు, క్రూర కర్మలు విజృంభిస్తాయి. వెలుగుపై చీకటి తన పంజా విసురుతుంది.
 
మహమ్మద్‌ ప్రవక్త(స) క్రీ.శ. 632లో పరమపదించిన అనంతరం ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధిని(ఖలీఫాను)  ఎన్నుకొనేవారు. హజ్రత్‌ అబూబక్ర్‌సిద్దీఖ్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ ఆ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. వారి పాలనలో శాంతి సౌఖ్యాలు శోభిల్లాయి. తరవాత వచ్చిన పాలకులు స్వార్థానికి అధర్మానికి లోనయ్యారు. వారి పాలనలో ధర్మం, సామరస్యం కరవయ్యాయి. మావియా అనే పాలకుడు పక్షపాత వైఖరి అవలంభించి ప్రజాస్వామ్య విధానాన్ని కాలదన్ని తన కుమారుడు యజీద్‌ను పాలకుడిగా నిరంకుశ ధోరణిలో ప్రకటించాడు. యజీద్‌కు లేని దుర్గుణాలు లేవు. మహమ్మద్‌ ప్రవక్త మనవడు ఇమామ్‌హుసైన్‌ ఈ నిరంకుశ రాచరికపు విధానాన్ని ప్రతిఘటించారు.

ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి చర్చల నిమిత్తం ప్రజల ఆహ్వానంపై రాజధాని కూఫా పట్టణానికి ఆయన బయల్దేరాడు. తమ మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది వెంట ఉన్నారు. ఇమామ్‌ హుసైన్‌ రాక విషయం గ్రహించిన దుష్టుడు, క్రూరుడు అయిన యజీద్‌ గుండెలో ద్వేషాగ్ని చెలరేగింది. ఇమామ్‌ను మధ్యలో అంతం చేయదలిచాడు. ఈ విషయం పసిగట్టిన ఇమామ్‌ శ్రేయోభిలాషులు కూఫా ప్రయాణం వద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఆశయ సాధనకోసం ప్రాణార్పణకైనా వెనకాడనని ప్రకటించారు ఇమామ్‌ హుసైన్‌.
 
ఇరువర్గాల మధ్య పోరు ప్రారంభమైంది. శాంతిని నిర్జించే అన్యాయంపైన ఇమామ్‌ హుసైన్‌ కత్తి దూశారు. స్వల్ప సంఖ్యలో ఉన్న అనుచరులు శత్రు సైన్యంతో భీకర యుద్ధం చేశారు. అమరగతి పొందిన ఈ వీర సైనికులు వేలకొద్దీ శత్రు సైన్యాన్ని పది రోజులు ముప్పుతిప్పలు పెట్టారు.
 
రణ భూమిలోనే ఇమామ్ హుసైన్‌ శుక్రవారం ప్రార్ధన నిమిత్తం శత్రువుల అనుమతి పొంది ప్రార్థనలో నిమగ్నులయ్యారు. భీరువులైన శత్రువులు ఇదే అవకాశం అని ఇమామ్‌హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి చంపారు. కనీస మానవత్వం సైతం మరచి సిగ్గువిడిచి విజయోత్సవం చేసుకొన్నారు. విషయం తెలిసిన అనంతరం సజ్జనుల హృదయాల్లో శోక తిమిరం అలముకొంది. అమర వీరులు నిర్మల యశః పూర్ణులయ్యారు. ఈ సమరం అరబ్బీ సంవత్సరం మొదటినెల మొహర్రంలో పదిరోజుల పాటు జరిగింది. మొహర్రం ప్రారంభంతో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. మొహర్రంలో ముస్లిములలోని షియాలు 'మాతమ్‌' చేస్తారు. కర్బలా వీరులపై గేయాల రూపంలో, మర్సియా, నౌహ, జారీ, సలామ్‌, అల్‌బిదా మొదలైనవి ఆలపిస్తారు.