శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (11:29 IST)

దేశంలో త్వరలో 5జీ సేవలు... ఈ యేడాది స్పెక్ట్రమ్ వేలం పాట

దేశంలో ఐదో తరం (5జి) తరంగాల వేలం పాటలు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ఈ సేవలను ఎంపిక చేసిన మెట్రో నగరాలు, నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తారు. మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వేలం పాటల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో 4జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై 5జీ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ యేడాది స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. ఇది టెలికాం రంగం అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. 
 
గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో బ్రాండ్ బ్యాండ్, మొబైల్ సేవల వ్యాప్తి కోసం యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద వచ్చే వార్షిక వసూళ్లలో 5 శాతం నిధులను కేటాయించనున్నట్టు తెలిపారు. పట్టణ వాసులతో సమానంగా గ్రామీణ ప్రజలకు ఎలక్ట్రానిక్, సమాచారం సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో నొక్కివక్కాణించారు.