బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (13:29 IST)

అరెస్టు భయంతో మెట్టుదిగిన ట్విట్టర్ : 97 శాతం ఖాతాల బ్లాక్

అరెస్టు భయంతో ట్విట్టర్ యాజమాన్యం మెట్టుదిగింది. రెచ్చగొట్టే ట్వీట్లు చేసిన ఖాతాలను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా 97 శాతం ఖాతాలను బ్లాక్ చేసినట్టు చెప్పుకొచ్చింది. 
 
కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్థాన్, ఖలిస్థాన్ సానుభూతిపరులు ‘రైతు హత్యల’ పేరిట హాష్ ట్యాగ్‌లు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి 1,435 ఖాతాలను తొలగించాల్సిందిగా ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులిచ్చింది.
 
అయితే, ప్రభుత్వ ఆదేశాలు భారత చట్టాలకు అనుగుణంగా లేవంటూ ట్విట్టర్ కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ సమాధానంపై కేంద్రం ఘాటుగానే స్పందించింది. వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందేనని ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ పునరుద్ఘాటించారు. పైగా, దేశ చట్టాలను గౌరవించకపోతే అరెస్టులు తప్పవని హెచ్చరించారు 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం తొలగించాలన్న ఖాతాల్లో.. 1,398 (97%) ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసినట్టు సమాచారం. గురువారం ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ.. ట్విట్టర్ ఉన్నతాధికారులు మోనిగ్ మీచీ, జిమ్ బేకర్ లతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటిస్తోందని, ప్రభుత్వం చెప్పిన దాదాపు అన్ని ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేస్తోందని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు చెప్పారు.