మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (08:40 IST)

భారత్‌లో కరోనా సంక్షోభం .. ట్విటర్ చేయూత

భారత్ కరోనా సంక్షోభంలో కూరుకుంది. ఈ వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతుంటే.. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. దీంతో అనేక మంది దాతలు ముందుకు వచ్చి.. తమవంతు సాయం చేస్తున్నారు. వీటిలో అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. పలు ప్రపంచ దేశాలు కూడా ఉన్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా మైక్రోబ్లాగింగ్‌ దిగ్గజం ట్విట్టర్‌ 15 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేర్‌, ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు. 
 
కేర్‌ సంస్థకు 10 మిలియన్‌ డార్లు ఇవ్వగా.. ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏలకు 2.5 మిలియన్‌ డాలర్ల చొప్పున ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, వెంటిలెటర్లు, బిపాప్‌, సీపీఏపీ యంత్రాలు సేకరించేందుకు గ్రాంట్‌ ఉపయోగపడుతుందని ట్విట్టర్‌ తెలిపింది.
 
ప్రభుత్వ దవాఖానాలు, కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలకు పరికరాలు సమకూరుస్తాయని, అలాగే తాత్కాలిక కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతుగా నిలిచేందుకు నిధులు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్‌, ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈ కిట్లు, ఇతర అత్యవసరమైన సామగ్రి అందించడంతో పాటు టీకాల పంపిణీలో సహాయం అందిస్తాయని పేర్కొన్నారు. 
 
అలాగే లాక్డౌన్‌లో మనుగడ సాగించేందుకు, జీవనోపాధిని తిరిగి పొందేందుకు, తక్కువ ఆదాయం ఉన్న వారికి, సేవ కార్యక్రమాలు చేపట్టే ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలను బలోపేతం చేసేందుకు ఆయా సంస్థలు నిధులను వినియోగిస్తాయని కంపెనీ తెలిపింది.