బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (11:19 IST)

వాట్సాప్ నుంచి ఇక చెల్లింపులు.. ఆర్బీఐకి డేనియల్ లేఖ.. మరి..?

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఓ శుభవార్త. సోషల్ మీడియా వేదికల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్.. ఇక చెల్లింపుల రంగంలోకి కాలుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. చెల్లింపుల రంగంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి వాట్సాప్ లేఖ రాసింది. ఈ మేరకు వాట్సాప్ సీఈఓ క్రిస్ డానియల్ ఆర్బీఐకి ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో వాట్సాప్ సంస్థకు భారత్‌లో 20 కోట్ల మంది వినియోగదారులున్నారని.. వీరికి చెల్లింపుల సేవలను అందించే దిశగా సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వాట్సాప్ పైలట్ ప్రాజెక్టు కింద పేమెంట్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. 
 
భారత్‌లోని తమ వినియోగదారులకు ఇలాంటి సేవలు అందించేందుకు అనుమతించాలని ఆ లేఖలో డేనియల్స్ రాశారు. తద్వారా తమ సంస్థకు చెందిన వినియోగదారులకు మేలు జరగడంతో పాటు దేశీయంగా డిజిటల్ రంగంలో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం వుందని డేనియల్ ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ వాట్సాప్ సీఈఓ డేనియర్ రాసిన లేఖపై ఆర్బీఐ ఇంకా స్పందించలేదు.
 
కానీ మోసపూరిత మెసేజ్‌లపై ఇప్పటికే వాట్సాప్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా వున్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ నుంచి అంత తొందరగా వాట్సాప్‌కు అనుమతులు లభించే అవకాశాలు మాత్రం కనిపించట్లేదని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చెల్లింపుల సేవలను వాట్సాప్ అందించాలంటే పలు నియంత్రణ మండళ్ల నుంచి ఆమోదం లభించాల్సి వుంటుందని వారు చెప్తున్నారు.