5కేజీలు.. డ్రోన్లతో ఫుడ్ డెలివరీ.. జొమాటో ప్రయోగం సక్సెస్..

drone
Last Updated: గురువారం, 13 జూన్ 2019 (16:18 IST)
ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ అయిన పుడ్‌ను డెలివరీ చేసే జొమాటో సరికొత్త రికార్డును సృష్టించింది. డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతం చేసింది. డ్రోన్లలో నిక్షిప్తం చేసిన సెన్సర్‌కు కంప్యూటర్ సెన్సర్‌తో అనుసంధానం చేయడం ద్వారా డెలివరీ చేసే ప్రాంతాన్ని ముందుగా డ్రోన్లు గుర్తిస్తాయి. ఆపై డెలివరీ చేస్తాయి. 
 
గత డిసెంబరులో జొమాటో.. డ్రోన్ సేవలు అందించేందుకు లక్‌నవూకు చెందిన స్టార్టప్‌ టెక్‌ఈగల్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో కేవలం పది నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు ప్రయాణించగల హైబ్రిడ్‌ డ్రోన్‌ ద్వారా బుధవారం పరీక్ష నిర్వహించినట్లు జొమాటో తెలిపింది. ఈ డ్రోన్‌ గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో, 5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని మోసుకెళ్లగలదని జొమాటో వెల్లడించింది. 
 
పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ పరిధిలోని ఒక నియంత్రణ ప్రాంతంలో ఈ పరీక్షను నిర్వహించింది. రోడ్డు మార్గం కన్నా ఆకాశ మార్గాన ఆహార పదార్థాలను మరింత వేగవంతంగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన సర్వీసులకు శ్రీకారం చుట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ పద్ధతిని దశలవారీగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :