శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (04:35 IST)

మన సాఫ్ట్‌వేర్ పరిశ్రమను దెబ్బకొట్టేవాళ్లు ఇంతవరకూ పుట్టలేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ధీమా

దశాబ్దాలుగా బలపడి అతర్జాతీయ మార్కెట్‌లో గట్టిపునాది వేసుకున్న భారతీయ సాప్ట్‌వేర్ పరిశ్రమను అంత సులభంగా ఎవరూ దెబ్బకొట్టలేరని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ధీమా వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిషేధాజ్ఞల పరంపరలో హెచ్1-బి వీసా సవరణ భారతీయ ఐటీ

దశాబ్దాలుగా బలపడి అతర్జాతీయ మార్కెట్‌లో గట్టిపునాది వేసుకున్న భారతీయ సాప్ట్‌వేర్ పరిశ్రమను అంత సులభంగా ఎవరూ దెబ్బకొట్టలేరని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ధీమా వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిషేధాజ్ఞల పరంపరలో హెచ్1-బి వీసా సవరణ భారతీయ ఐటీ పరిశ్రమకు పెద్ద అవరోధంగా మారుతోందని ఐటీ పరిశ్రమ కలవరపడుతున్న నేపథ్యంలో.. అమెరికా పాలనా యంత్రాంగంతో చర్చలకోసం నాస్కామ్, ఐటీ సీఈవోలు అమెరికా వెళుతున్న సందర్భంలో మన సాఫ్ట్‌వేర్ కంపెనీలు మరీ అంతగా వణికి చావాల్సిన పనిలేదని ఎన్ఆర్ మూర్తి స్పష్టం చేశారు. 
 
హెచ్1-బి వీసాపై ట్రంప్ తెచ్చిన సవరణ ప్రభావం భారతీయ సాఫ్ట్ వేర్ పరిశ్రమపై పడకుండా చూడటానికి నాస్కామ్, ఐటీ కంపెనీల సీఈఓలు అమెరికా వెళ్లడం మంచిదే. కాదనను. కానీ ఆ చర్చల అనంతరం ఏం జరుగుతుందనే విషయాన్ని పరిశీలిస్తే మనకు చాలా అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అంతే తప్ప ఇక సర్వస్వమూ కుప్పగూలిపోతున్నట్లుగా వణికిపోవలసిన అవసరం ఏమాత్రమూ లేదని ఎన్ ఆర్ మూర్తి చెప్పారు. 
 
హెచ్1- బి వీసా చట్టానికి ట్రంప్ సవరణ వల్ల మొదటి సంభావ్యతగా మన భారతీయ కంపెనీల లాభాలు పడిపోవచ్చు. అయితే ఐటి పరిశ్రమ మొత్తంగా దీనివల్ల ప్రభావితం అవుతుంది కనుక లాభ క్షీణత అనేది కంపెనీకి, కంపెనీకి మధ్య మారుతుంటుంది. ఈ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్‌కి సంబంధించినంతవరకు ఏమంత పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ట్రంప సవరణ ప్రభావానికి గురవుతారు కాబట్టి కంపెనీల వృద్ధిలో తీవ్రమైన మార్పులు పెద్దగా చోటుచేసుకోవు.
 
ఇక రెండో సంభావ్యత ఏమిటంటే, అమెరికా కార్పొరేషన్ల సమాచార మౌలిక కల్పనా వ్యవస్థలో భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీరు అమెరికాలోని తమ కస్టమర్లతో కూర్చుని ట్రంప్ సవరణల నేపథ్యంలో తమ సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల గురించి చర్చించి పరిష్కరించుకోగలవు. కాబట్టి ఐటీ కంపెనీల లాభదాయకత మనమనుకున్నంత తీవ్రంగా ప్రభావితం కాదు. స్పష్టమైన విషయం ఏమిటంటే మన ఐటీ కంపెనీలు కస్టమర్ కోసం కొంత డబ్బు  వదులుకోవలసి ఉంటుంది. అదే సమయంలో తమ లాభాల్లో కొంత భాగాన్ని నష్టపోవలసి వస్తుంది కూడా అని మూర్తి చెప్పారు
 
ఇక మూడో సంభావ్యత ఏమిటంటే మన సాఫ్ట్ వేర్ కంపెనీల సృజనాత్మక ఆవిష్కరణలు.  ఈ విషయంలో మనది అసాధారణమైన పనివిధానమనే భావించాలి. 2013లో మేము ఇన్ఫోసిస్ కంపెనీలో వీసాతో పనిలేని గ్లోబల్ డెలివరీ మోడల్‌ను తీసుకువచ్చాం. దీనిద్వారా ఒక ప్రాజెక్టులో మొత్తం ఖర్చును 30 శాతం వరకు తగ్గించుకోగలిగాము. విదేశాల్లో 10 శాతం ప్రాజెక్టులను స్థానిక నియామకాల ద్వారా పూర్తి చేయవచ్చు. ఈ విషయంలో మేం చాలా పైలట్ ప్రాజెక్టులను నిర్వహించాం. దాదాపు అన్ని ప్రాజెక్టులూ విజయవంతమయ్యాయి. అందుచేత ఐటీ పరిశ్రమ మొత్తంగానే వీసాతో పనిలేని గ్లోబల్ డెలివరీ మోడల్ వైపుగా పయనించవచ్చు. ఉదాహరణకు 1990లలో ఇన్ఫోసిస్ సంస్థ గ్లోబల్ డెలివరీ మోడల్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఐటీ పరిశ్రమ మొత్తం దాన్ని అనుసరించిది.
 
కాబట్టి ట్రంప్ తీసుకొచ్చిన హెచ్1-బి వీసా చట్ట సవరణ పట్ల మరీ అంతగా ఆందోళన చెందవలసిన పనిలేదు. రేపేమవుతుంది అంటూ ఊరకే భయంతో వణకి చావాల్సిన అవసరం అంతకంటే లేదు. భారతీయ ఐటీ పరిశ్రమ స్మార్ట్‌నెస్ ప్రభావం గురించి తెలిసిన వాడిగా ఒక పరిష్కారాన్ని అది తీసుకువస్తుందని, నూతన సాధారణ స్థితికి పరిణామాలు చేరుకుంటాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి మొత్తం ఐటీ పరిశ్రమకు భరోసా నిచ్చారు.