జగన్ విషయంలో కాంగ్రెస్‌కు లేటుగా జ్ఞానోదయమైందా? ఔనంటున్న పెద్దాయన
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శక్తిని అంచనా వేయడంలో అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ, సీనియర్ నేతలు కానీ ఘోరంగా విఫలమయ్యారని మాజీ కేంద్రమంత్రి ఎస్ జైపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శక్తిని అంచనా వేయడంలో అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ, సీనియర్ నేతలు కానీ ఘోరంగా విఫలమయ్యారని మాజీ కేంద్రమంత్రి ఎస్ జైపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ మరణానంతరం ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల తెలుగు ప్రజలకు ఏర్పిడిన అపారమైన సానుభూతిని కాంగ్రెస్ పార్టీ సరిగా అంచనా వేయలేకపోయిందని ఆయన అంటున్నారు.
పైగా జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో కోరుకుంటున్నట్లుగా ముఖ్య మంత్రి పదవి తనకే కావాలని వెలిబుచ్చిన ఆకాంక్షను తప్పుగా అర్థం చేసుకున్నామని, సీఎం పదవిపై ఆయన కోరికను కొంతమేరకయినా తాము గుర్తించవలసిన ఉండేదని, ఆ పని చేయలేకపోయినందువల్లే ఆయనను అధిష్టానం కానీ, తాము కాని సమస్యగానే భావించామని జైపాల్ రెడ్డి చెబుతున్నారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి పరిణామాలను ఆయన పూస గుచ్చినట్లు వివరించారు. జగన్ జనాదరణను అంచనా వేయడంలో తమ వైఫల్యం గురించి ఆయన మాటల్లోనే చూద్దాం.
"బతికున్నప్పటికంటే మరణించాకే వైఎస్‌పై ప్రజల్లో సానుభూతి మరింతగా పెరిగింది. ఆ పరిణామాన్ని గుర్తించడంలో హైకమాండ్ లేక మాలాంటివాళ్లం విఫలమయ్యాం. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి విషయంలో చేసిన క్లెయిమ్‍ని కొంతమేరకయినా మేం గుర్తించవలసి ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలలోనే కాదు ప్రజల్లో కూడా వైఎస్ కుటుంబంపై అప్పట్లో సానుభూతి ఏర్పడింది. మొత్తంగా ప్రజల్లో వైఎస్ కుటుంబంపై ఉన్న ఆదరణను సరిగా అంచనా వేయలేకపోయాం."
అయితే వైఎస్ జగన్‌పై కేసులు పెట్టడం, జైలుకు పంపించడం లాంటివి అప్రజాస్వామికమైన చర్యలు కాదా అన్ని ప్రశ్నకు జైపాల్ రెడ్డి సమాధానం దాటవేశారు. "ఆనాటికి రాష్ట్ర రాజకీయాల్లో నేను లేను. రికార్డు ప్రకారం చూసినప్పుడు ఇవన్నీ కోర్టు చొరవవల్ల జరిగినట్లు తెలుస్తోంది. నాకు విషయం తెలియనప్పుడు దానిపై అభిప్రాయం చెప్పలేను" అనేశారాయన.
కానీ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత స్థానంలో ఉండి జగన్ ఆకాంక్షను అంచనా వేయడంలో పార్టీ మొత్తంగా విఫలమైందని జైపాల్ రెడ్డి ఇన్నేళ్ల తర్వాత అంచనా వేయడం గమనార్హం.