వారు కాలిగా ఉంటే.. ఇలా చేయించాలి..?
బడి ఉన్నప్పుడే కాదు సెలవు రోజుల్లో కూడా పిల్లలకు టైంటైబుల్ వేయాలి. అంటే.. తినడానికి, ఆటలకు, విశ్రాంతికి, టీవీ చూడ్డానికి, ఫోన్ గేమ్స్‌కు పక్కాగా సమయం నిర్ణయించాలి. ఇలా చేయడం వలన వారిలో క్రమశిక్షణ అలవడుతుంది. అంతేకాదు ఎక్కువ సమయం టీవీ, ఫోన్‌కు అతుక్కుపోకుండా ఉంటారు.
పిల్లలను కుదిరినప్పుడల్లా పార్కుకు తీసుకెళ్లాలి. కాస్త పెద్ద పిల్లలయితే బయట వాళ్లంతట వాళ్లు ఆడుకోమని చెప్పాలి. అప్పుడే వారు శారీరకంగా చురుగ్గా ఉంటారు. సమయం ఉన్నప్పుడు బంధువులు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లడం వారితో మాట్లాడించడం, విందులు వేడుకలకు వెంట పెట్టుకెళ్లడం వంటివి చేస్తుండాలి. దీని వలన వారికి బంధువులు, స్నేహితులు తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో వారి ప్రపంచం కూడా మారుతుంది.
ఇంటి పనుల్లో పిల్లల సాయం తీసుకోవడం వలన వాళ్లకు పనులు అలవాటవుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని పట్టించుకునేదేముంటుంది అనుకుంటారు చాలామంది. అలా అనుకోవడం సరికాదు. పిల్లలతో మాట్లాడుతూనే పనిచేయాలి. పనిలేనప్పుడు వారితో కబుర్లు చెప్పడం.. లేదంటే వారితో చెప్పించుకోవడం చేయాలి. అప్పుడే వారిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెరుగుతాయి.