వారికి పొదుపు ఎలా నేర్పించాలి..?
నేటి తరుణంలో డబ్బుకే విలువ ఎక్కువగా ఉంది. అందువలన వారికి డబ్బు విలువ గురించి చిన్నతనం నుండే నేర్పించాలి. అవసరాలు, కోరిక మధ్య తేడా ఏంటో స్పష్టంగా వారికి అర్థమయ్యేలా వివరించాలి. తిండీ, దుస్తులు, ఉండడానికి ఇల్లు వంటివి ప్రాథమిక అవసరాలను, మిగిలిన కోరికలను తెలియజేయాలి.
పిల్లలు ప్రతీ విషయాన్ని తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. ఎక్కువగా అమ్మానాన్నలను అనుసరిస్తారు. కనుక డబ్బు పొదుపు విషయంలో మీరు కచ్చితంగా ఉండాలి. నెల ప్రారంభంలో ఉన్న డబ్బంతా ఖర్చుచేసి నెల చివరల్లో దంపతులిద్దరూ కీచులాడుకుంటే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. చిన్నారులకు డబ్బు ఇవ్వడం మంచిది కాదని చాలామంది చెప్తుంటారు.
అయితే ఇందులో నిజం లేదు. వారికి పొదుపు అలవాటం చేయాలన్నా, డబ్బు విలువ తెలియాలన్నా వారి చేతికి కొంత మొత్తం డబ్బు ఇవ్వాల్సిందే. అలానే వారి అవసరాలకు వాటిని వాడుకోమని చెప్పాలి. చిన్న చిన్న పనులు చేసినప్పుడు కానుకగా వారికి కొంత డబ్బు ఇవ్వాలి. ఇలా చేయడం వలన డబ్బు దాంతోపాటు పని విలువ కూడా వారికి తెలుస్తుంది.
ముఖ్యంగా మీరు ఇచ్చే డబ్బును వారు రోజు ఎలా ఖర్చు పెడుతున్నారో ఓ పుస్తకంలో రాసుకోమనాలి. వారాంతంలో ఓసారి చూసుకుంటే దేనిదోసం ఎంత ఖర్చు పెడుతున్నారో వారికి తెలుస్తుంది. అనవసర ఖర్చులు కూడా తెలిసిపోతాయి. దుబారా చేస్తే కోప్పడకుండా ఆ డబ్బు ఎలా నిరుపయోగంగా మారిందో చెప్పాలి. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా వారికి గుణపాఠంలా గుర్తింటుంది.