కృష్ణా అంటే... విజయవాడ, గోదావరి అంటే రాజమండ్రేనా? మండిపడిన కేసీఆర్
కృష్ణా అంటే... విజయవాడ, గోదావరి అంటే రాజమండ్రేనా? మండిపడిన కేసీఆర్
మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ... గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి అనేలా ఆంధ్ర పాలకులు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్ నగర్‌లో పుష్కరాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుష్కర స్నానం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణా ప్రాశస్త్యాన్ని గత ఆంధ్ర పాలకులు పూర్తిగా విస్మరించారన్నారు. కృష్ణ ఇక్కడా ఉంది... గోదావరి అసలు ఇక్కడే ఎక్కువ... కానీ, ఇక్కడ గుర్తింపు తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పుష్కర స్నానం అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప భాగ్యమని కేసీఆర్ అన్నారు. అమ్మవారి దయతోనే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. వర్షాలు పుష్కలంగా పడి ప్రాజెక్ట్‌లన్నీ నిండాలని ఆకాంక్షించారు. రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. ప్రతి ఏడాది 5 వేల నుంచి 10 వేల మంది ఉపాసకులు అలంపూర్ వచ్చి వెళ్తుంటారన్నారు.
జోగులాంబ ఆలయ అభివృద్ధిపై ప్రధానితో మాట్లాడుతానన్న సీఎం, అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన అప్పటి పాలకులకు రాలేదని విమర్శించారు. ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు నీరు రావాల్సిందే అని తేల్చిచెప్పారు.