శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By JSK
Last Modified: గురువారం, 18 ఆగస్టు 2016 (17:22 IST)

కృష్ణా పుష్కరాల్లో తితిదే, స్వచ్చంద సంస్థల ఉచిత అన్న ప్ర‌సాదం... ఈగలు తోలుకుంటున్న హోట‌ల్స్...

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజ‌య‌వాడ‌కు అశేషంగా త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు అధిక ధ‌ర‌ల‌కు తినుబండారాలు అమ్మి సొమ్ము చేసుకుందామ‌నుకున్న హోట‌ళ్ళ‌కు ఈసారి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఎక్క‌డ చూసినా ఉచిత అన్న ప్ర‌సాదాల‌ను స్వ‌చ్చంద సంస్థ‌లు అంది

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజ‌య‌వాడ‌కు అశేషంగా త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు అధిక ధ‌ర‌ల‌కు తినుబండారాలు అమ్మి సొమ్ము చేసుకుందామ‌నుకున్న హోట‌ళ్ళ‌కు ఈసారి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఎక్క‌డ చూసినా ఉచిత అన్న ప్ర‌సాదాల‌ను స్వ‌చ్చంద సంస్థ‌లు అందిస్తుండ‌టంతో ఎక్క‌డా అన్నానికి క‌రువు లేకుండా ఉంది. స్వ‌చ్చంద సంస్థ‌ల‌కు తోడు తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న అన్నప్రసాదాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రోజుకు లక్ష మంది వరకు భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. 
 
ప్రభుత్వ యంత్రాంగం, స్థానికుల సహకారంతో శ్రీవారి సేవకులు ఎంతో క్రమశిక్షణతో ఆప్యాయంగా భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. తితిదే అందిస్తున్న అన్నప్రసాదాలు కావడంతో పుష్కర స్నానం చేసిన భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరిస్తున్నారు. పుష్కర భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసిన విషయం విదితమే.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచన మేరకు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డి.సాంబశివరావు ఆదేశాలతో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడలోని తితిదే కల్యాణమండపంలో ఇందుకోసం ప్రత్యేకంగా వంట గది, స్టోర్ గది, వంట పాత్రలు ఏర్పాటు చేశారు. 
 
అన్నప్రసాదాల తయారీకి 300 లీటర్ల సామర్థ్యం గల 16 స్టీమ్‌ రైస్‌ వెజల్స్‌, 600 లీటర్ల సామర్థ్యం గల బాయిలర్లు 2,400 లీటర్ల సామర్థ్యం గల బాయిలర్లు 4, అన్నప్రసాదాల పంపిణీకి మూతతో కూడిన పాత్రలను వినియోగిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని వండుతున్నారు. అన్నప్రసాదాల పంపిణీపై తితిదే జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ప్రతిరోజూ తితిదే కల్యాణమండపంలో పుష్కరాల ప్రత్యేకాధికారి శ్రీ రామారావు, అన్నప్రసాద విభాగం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు.
 
భక్తుల ఆదరణ పొందిన మెను 
భక్తులు బాగా ఇష్టపడే పొంగలి-చట్ని, ఉప్మా-చట్ని, రుచికరమైన టమోటా రైస్‌ తయారుచేస్తున్నారు. అన్నప్రసాదాలను డిజైన్డ్‌ ఫుడ్‌ పేపర్‌ బౌల్స్‌లో భక్తులకు అందిస్తున్నారు. కూరగాయలు కొంతవరకు దాతలు విరాళంగా అందిస్తున్నారు. బియ్యం, ఇతర వంట సామగ్రిని అన్నప్రసాద విభాగం సమకూర్చుకుంటోంది. తితిదే ఈవో ఆదేశాల మేరకు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి ధ్రువీకరించేందుకు ప్రత్యేకంగా పరిశోధనశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిశీలించిన తరువాతే అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా వంట మనుషులు పనిచేస్తున్నారు. వంటసామగ్రి కొనుగోలు, అన్నప్రసాదాల తయారీ, వాహనాల్లో లోడ్‌ చేయడం, భక్తులకు పంపిణీ చేయడం, పాత్రలను తిరిగి తీసుకురావడం, వాటిని శుభ్రం చేయడం, మరుసటిరోజు తిరిగి ఉపయోగించడం చేస్తూ చక్కటి ప్రణాళికతో తితిదే అన్నప్రసాద విభాగం ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
 
9 కేంద్రాల్లో అన్నప్రసాదాలు పంపిణీ : జెఇవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు
విజయవాడలోని రైల్వే స్టేడియం, వైవిఆర్‌ ఎస్టేట్స్‌, వుడా పార్క్‌, ఆర్‌టిసి బస్టాండ్‌, సీతమ్మవారి పాదాలు, గుంటూరు జిల్లాలోని రైల్వేస్టేషన్‌(కృష్ణా కాలువ), రిథమ్‌ ఓపెన్‌ థియేటర్‌, ఎయిమ్స్‌, మోడల్‌ డెయిరీ(కొలనుకొండ హైవే) ప్రాంతాల్లో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటుచేసి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్టు తితిదే జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. విజయవాడలోని తితిదే కల్యాణమండపంలో అన్నప్రసాదాల తయారీని జెఈవో గురువారం పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందని, గురువారం పౌర్ణమి కావడంతో సీతమ్మపాదాలు కేంద్రం వద్ద సాయంత్రం 22 వేల మంది భక్తులకు అదనంగా అన్నప్రసాదం పంపిణీ చేశామ‌ని తెలిపారు. అన్నప్రసాదాల తయారీకి మొత్తం 100 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా పనిచేస్తున్నట్టు వివరించారు. అన్నప్రసాదాలు తయారుచేసేందుకు ఒక రోజుకు 6 వేల కిలోల బియ్యం, 1100 కిలోల రవ్వ, 840 లీటర్ల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, 200 కిలోల నెయ్యి, 200 కిలోల జీడిపప్పు, 1000 కిలోల వివిధ రకాల పప్పులు, 2 వేల కిలోల టమోటా వినియోగిస్తున్నట్టు జెఈవో వెల్లడించారు.