శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By IVR
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2014 (19:47 IST)

ప్రేమికుడే కానీ మంచోడు కాదు... శాంతియుతంగా వదిలించుకోవడమెలా...?

-జయశ్రీ

అమృతం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రేమికులు చెప్పుకునే మాటలు మాత్రం అమృతానికి ఆవల ఉంటాయి. ఒకరి హృదయంతో మరొకరి హృదయం మాటాడుకుంటాయి. కళ్లుకళ్లు కలుసుకుంటాయి. చూపులు చిత్రాలు చేస్తాయి. శరీరాలు భాషకే అందని మాటలు మాట్లాడుతాయి. వెరసి ప్రేమికుల లోకం ఓ అద్భుతమైన ఆనందాల హరివిల్లు. 
 
కానీ ఇంద్రధనుస్సులో ఉండే ఏడురంగులను ఎల్లప్పుడూ... అంటే తమ ప్రేమలో ఉన్నన్నాళ్లూ సుఖసంతోషాలతో ఆస్వాదించే జంటలు కొన్ని ఉంటే, మరికొన్ని జంటల్లో ఇంద్రధనుస్సును కకావికలం చేస్తూ కాసే తెల్లటి ఎండలా బీటలు వారుతాయి. దీనికి కారణం ఒకరి మనస్తత్వాలు ఒకరికి సరిపడకపోవడమే. ప్రేమించే ముందు ఆ అబ్బాయి చాలామంచిగా ఉన్నాడు. 
 
ప్రేమలో పడ్డాక నన్ను వేధిస్తున్నాడు. నా మనసు పరిపరివిధాలా కొట్టుకులాడుతోంది. చనిపోవాలని ఉంది... అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటుంటారు. అది కరెక్టు కాదు. మీరు మీలానే ఉన్నారు. కానీ మీ జీవితంలో ప్రవేశించిన మరొకరు మీ జీవితంలోని ఆనందాన్ని తుంచేస్తున్నారు. అలాంటి వాడు మీ జీవితంలో ఇంకా ఎందుకు... వదిలేస్తే పోలా...? ఐతే అది అంత తేలికా... కాకపోవచ్చు. కానీ కొన్ని పద్ధతుల ద్వారా అతడికి క్రమంగా దూరం జరిగిపోవచ్చు. దాంతో మీ జీవితంలో కోల్పోయిన సిరినవ్వుల సందడి మీ సొంతం అవుతుంది. అవేంటో ఒక్కసారి లుక్కేయండి మరి.
 
వ్యక్తిగతంగా అతడితో కలిసి కాసేపు...
 
అతడికి గుడ్ బై చెప్పేందుకు మధ్యవర్తులు ఎవ్వరూ అక్కర్లేదు. నేరుగా అతడి ఎదురుగానే ఆ మాట చెప్పవచ్చు. ఐతే అది అంత తేలిక్కాదు. ఆ సమయంలో అతడిని చూస్తూ గుడ్ బై చెప్పడం కూడా చాలా కష్టమే. అతడు గబుక్కున ముద్దులు పెట్టవచ్చు. ఐతే మీ నిశ్చయం దృఢమైనది. అతడితో ఇక ఎంతమాత్రం కుదరదు. కనుక అతడిని ఏకాంతంగా కలిసేకంటే ఏదో కేఫ్ లోనో పబ్లిక్ పార్కులోనో కలిసి మీ సమస్యను చర్చించి ఎలాంటి వాదోపవాదాలు లేకుండా గుడ్ బై చెప్పేసి గుండె బరువు దించుకుని వచ్చేయవచ్చు.
couple














ఫోనులో మాట్లాడుతూ చెప్పేయవచ్చు...
 
అతడిని చూస్తూ గుడ్ బై చెప్పడం సాధ్యం కాదనుకుంటే మీకు ఉన్న సరైన సాధనం ఫోన్. ఫోను ద్వారా మీరు అనుభవిస్తున్న క్షోభను, సమస్యను చెప్పేయండి. ఈ సమయంలో అతడి వివరణలకు మీరు తృప్తి చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే మీరు అప్పటికే ఎన్నో రోజులు అతడి ప్రవర్తనను చూసి ఓ నిర్ణయానికి వచ్చేశారు. కాబట్టి ఇక ఎంతమాత్రం అతడి వివరణలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదు. చాలా క్లుప్తంగా మాట్లాడుతూ గుడ్ బై చెప్పేయడమే.

వెళ్లిపోవడమే....
కొన్నిసార్లు మనం చెప్పదలచుకున్నది చెప్పేందుకు మాటలు రావు. అలా ఎందుకంటే ప్రేమించుకున్నవారు మాత్రమే.. అంటే ప్రేమికులు మాత్రమే దానికి సమాధానం ఇవ్వగలరు. కాబట్టి ఇలా మాటలు పెదవులు దాటి బయటకు రానప్పుడు చేష్టల ద్వారా అతడికి దూరంగా జరిగిపోవచ్చు. అదెలాగంటే... మీరు ఉంటున్న ప్రదేశాన్ని వదిలేసి కొన్నాళ్లు వేరే ప్రాంతానికి మకాం మార్చేయడమే. మీరు నగరంలో ఉంటే ఓ పల్లెటూరికి వెళ్లిపోవడమే, పల్లెటూర్లో ఉంటే నగరంలోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోవడమే చేయాలి. అలా వెళ్లినప్పుడు మీ బంధంలో ఏర్పడిన బీటలు, వాటికి కారణాలు మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల మనస్పర్థలతో, వాగ్వాదాలతో అతడితో గడపాల్సిన పరిస్థితి ఉండదు. 
love
తిన్నగా ఇ-మెయిల్ పంపేయవచ్చు...
 
మాటలు కాదు, చేష్టలు కుదరవు, వేరే ఊరికి వెళ్లలేను, ఫోనులో చెప్పలేను అనుకున్నప్పుడు మరొక మార్గం ఇ-మెయిల్. చాలా సందర్భాల్లో ఇ-మెయిళ్ల ద్వారా అనుకున్నది చెప్పేసి తప్పుకోవడం జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ లేఖలో మీ వ్యక్తిత్వం ప్రతిబింబించాలి. అలాంటి వ్యక్తిత్వం తనకు జోడీగా రావాలనుకుంటున్న వ్యక్తిలో కనబడలేదు కనుక దూరం కావాలని నిర్ణయించుకున్నానని రాసేయవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక అంతటితో ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు.
 
క్షమాపణలు చెబితే వినాల్సిన పనిలేదు...
 
ఒక్కసారి మీ ప్రేమికుడి నుంచి దూరం కావాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అతడు క్షమించమని వేడుకున్నా వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే మీరు ఈ నిర్ణయానికి రావడానికి ముందే ఇలాంటి క్షమాపణలు చాలా చూచి ఉంటారు. కనుక వాటిని ఖాతరు చేయాల్సిన పనిలేదు. దుఃఖంతో, విచారంతో, హృదయ వేదనతో ప్రేమికుడితో ప్రేమను పంచుకోవడం దుర్లభం. కాబట్టి దూరంగా జరగడం మినహా మరో మార్గం లేనేలేదు. ఐతే అతడు బతిమాలేటపుడు అతడిని దూషించడమో, అవమానించడమో చేయకూడదు. మంచితనంగానే... మృదువైన భాషతో సున్నితంగా తిరస్కరిస్తూ అతడికి దూరంగా జరగాలి.
గుడ్ బై చెప్పేసి మళ్లీ అతడితోనా... వద్దేవద్దు...
 
కొంతమంది అమ్మాయిలు మొదట వద్దనుకుని కొంతకాలం గడిచాక అతడు మారిపోయాడులే అనుకుని మళ్లీ ప్రేమ పునాదులకు రంగులు వేసేందుకు సిద్ధమవుతారు. ఇలాంటి చర్య మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దూరమైన తర్వాత మరోసారి పాత ప్రేమకు కొత్త మొగ్గలు తొడిగించాలని చూడవద్దు. గతం గతః. అతడి నుంచి దూరమైపోయారు కనుక ఆ దూరం అలానే ఉంచడం మంచిది. మళ్లీ చిగురింపులు తొడిగించినా అవి వాడిపోకుండా ఉండవన్న గ్యారెంటీ లేదు మరి. నిజానికి ప్రేమికుల్లో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి స్థితికి రావచ్చు. ఐతే అన్ని ప్రేమ జంటలు బంగారు జీవితాలను అనుభవించాలని మనం కోరుకుందాం.