శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By chj
Last Modified: ఆదివారం, 6 మార్చి 2016 (19:58 IST)

బ్రహ్మ, విష్ణుల అహంకారం... మహా శివరాత్రి నాడు పటాపంచలు...

చాంద్రమాన నెలలను అనుసరించి అమావాస్య ముందు మాఘ మాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి ప్రశస్తమైనది

చాంద్రమాన నెలలను అనుసరించి అమావాస్య ముందు మాఘ మాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. శివక్షేత్రములందు 'శివరాత్రి'ని పార్వతీపరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు. 
 
సకల శుభాలను సౌభాగ్యాలను అందించు ఆది దేవుడు శంకరుడు. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రిని క్రమం తప్పకుండా పూజిస్తే అంతటి పుణ్యఫలం దక్కుతుందో.. ఒక్క శివరాత్రి నాడు శివుడిని అర్చించి, పూజిస్తే అంతటి ఫలం దక్కుతుందని శివ పురాణం, లింగపురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్ధశి లింగోద్భవ వేళ పరమ శివుడిని అర్చించి, జాగారం చేసే వారికి అన్ని పాపాలు తొలిగిపోయి, శుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శైవులు తాము ధరించే భస్మము, విభూతిని తయారుచేయటానికి శివరాత్రి పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు.
 
శివరాత్రి పర్వదినాన వేకువ జామునే లేచి అభ్యంగన స్నానం చేసి, శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయానికి వెళ్ళి లింగోద్భవ వేళ స్వామి వారి విశేష పూజలను అర్చనలను దర్శించి, శివ నామ స్మరణతో జాగారం చేయాలి. శివునికి అత్యంత ప్రీతిపదమైన బిల్వ దళాలతో శివరాత్రిని నాడు స్వామిని అర్చిస్తే పరమ శివుడు పరమానందభరితుడైన వరాల వర్షాలను కురిపిస్తాడని ప్రతీతి. మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. 
 
పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివ పరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతారు. మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవ కాలం అని అంటారు.
 
శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించటానికి ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాటామాటా పెరిగి ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరు సై అంటే సై అనుకున్నారు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాసం చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ, విష్ణువు ఆ లింగం ఆద్యాంతాలను తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఆది, తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని శివుడు వద్దకు వస్తారు. 
 
తాము ఓడిపోయామని ఒప్పుకుంటారు. అప్పుడు శివుడు తన నిజ రూపంతో వీరికి దర్శనమిస్తాడు. అంతేకాకుండా అనుగ్రహించి వారిలోని అహాన్ని పోగొడతాడు. దానితో బ్రహ్మ, విష్ణువు శివుడి ఆధిక్యతను పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహా శివరాత్రి అయిందని కూడా అంటారు. మృత్యుంజయ మంత్రం  వంటి శక్తివంతమైన పురాతన సంస్కృత మంత్రాలు యొక్క ప్రయోజనాలు - శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది. అన్ని శైవ క్షేత్రాలలోను ఈ ఉత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు.
 
మృత్యుంజయ మంత్రం:- “ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్”

- డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి(ఆంధ్రప్రదేశ్)