సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:55 IST)

సోమవారం పూట మహాశివరాత్రి.. లింగోద్భవకాలంలో ఇలా చేస్తే?

మహా శివరాత్రి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివనామస్మరణతో అనుకున్నది సాధించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అందుచేత మహాశివరాత్రి రోజంతా ఉపవాసం వుండి ఆ రోజు సాయంత్రం పూట పరమశివుడికి అభిషేకం చేయించి.. మారేడు దళాలను సమర్పించాలి.


ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి పగలంతా శివుడి లీలా విశేషాలకు సంబంధించిన గ్రంథాలను పారాయణం చేస్తూ గడపాలి. ఇక సాయంత్రం పూజాభిషేకాలు ముగిశాక శివనామ స్మరణతో జాగరణ చేయాలి. 
 
అవకాశం వుంటే సమీపంలోని శివాలయాలకు వెళ్లి స్వామివారి సన్నిధిలో దీపారాధ చేయాలి. ఇంకా ఆలయాల్లో జరిగే నాలుగు జాముల పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వీలైతే భక్తులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి శివాలయంలోనే జాగరణ చేయవచ్చు. ఈ విధంగా మాసశివరాత్రి రోజున దృష్టినీ .. మనసును స్వామివారి పాదాల చెంత ఉంచి సేవిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. 
 
మార్చి నాలుగో తేదీన మహా శివరాత్రి వస్తోంది. అదీ సోమవారం పూట మహాశివరాత్రి రావడం శుభఫలితాలను ఇస్తుంది. ఈ రోజున బ్రహ్మీమూహూర్తంలో నిద్రలేచి ఇల్లాంత శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజగదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగకారంలో ఉన్న శివునికి జలంతో, పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మిపూలను,  తెల్లని, పచ్చని పూలతో శివనామాలను స్మరించుకుంటూ పూజించాలి. తాంబూలం, అరటి పండు, జామపండు, ఖర్జూర పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. 
 
శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో శివుడికి అభిషేకం చేయిస్తే పునర్జన్మ అంటూ వుండదని విశ్వాసం. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే మహాశివ రాత్రి రోజున భక్తితో నీళ్ళతో అభిషేకం చేసినా స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు ఆలయాల్లో జరిగే అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు.