మూతపడనున్న పురాతన రైల్వే లైను
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ధుధ్వా నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే 109 ఏళ్ల పురాతన రైల్వే లైను మూతపడనుంది. నాన్‌పారా - మైలానీ మధ్య నడిచే 171 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం అడవుల మధ్య నుంచి సాగుతుంది. లఖీంపూర్ - మైలానీ బ్రాడ్ గేజ్ మార్గం ఈ నెలాఖరుకు ప్రారంభం కానుంది. తర్వాత నాన్‌పారా - మైలానీ రైలు మార్గం మూతపడనుంది. అటవీ జంతువులు, అటవీ సంరక్షణ దృష్ట్యా సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు నాన్‌పారా - మైలానీ రైలు మార్గాన్ని మూసివేయనున్నారు.
ఈ సందర్భంగా రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తాము ధువాన్ వచ్చే ప్రయాణికుల కోసం ఒక టాయ్‌ట్రైన్ ప్రారంభిస్తామని, దానివలన అటవీ జంతువులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదని తెలిపారు. కాగా ధుధ్వా టైగర్ రిజర్వ్‌కు చెందిన అధికారి సంజయ్ పాఠక్ మాట్లాడుతూ గత 20 ఏళ్లలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదాల్లో వందకు మించి జంతువులు మృతి చెందాయని అన్నారు.