మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (10:07 IST)

సూరత్‌లో దారుణం.. నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన లారీ!

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఓ దారుణం జరిగింది. గాఢ నిద్రలో ఉన్న కూలీలపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ దారుణం జరిగింది. మృతులను రాజస్థాన్‌లోని బాన్స్‌వాడాకు చెందిన వారిగా గుర్తించారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో కోసంబిలోని ఓ చౌరస్తా నుంచి మాండివైపు లారీ వేగంగా వెళుతోంది. అదేసమయంలో ఎదురుగా చెరకు లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ పైకి లారీని మళ్లించాడు.
 
ఈ క్రమంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 18 మంది కూలీల పైనుంచి లారీ దూసుకుపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే 12 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుంచి 9 నెలల చిన్నారి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.