1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (13:48 IST)

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వలస కార్మికులు.. 16మంది మృతి

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తమ స్వస్థలాలకు బయలుదేరిన పలువురు వలస కూలీలు రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. రైలు పట్టాలు, రోడ్డుపై లారీల ప్రమాదాలు వలస కార్మికులను తిరిగి రాని లోకాలకు చేరుస్తున్నాయి. ఇలా వివిధ ప్రమాదాల్లో మొత్తం 16 మంది మరణించారు. తాజాగా బీహార్‌లోని బగల్‌పూర్‌లో నౌగచియాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 9మంది వలస కూలీలు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వలస కార్మికులతో వెళుతున్న లోడు లారీ, బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డుపక్కన పడిపోయింది. దీంతో వలస కార్మికులు మృత్యువాత పడ్డారు. అలాగే మహారాష్ట్ర యవత్మాల్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలసకూలీలు మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఇక సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ-మీర్జాపూర్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. 17 మంది వలసకూలీలతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.