1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (18:20 IST)

2జీ స్కామ్‌ దర్యాప్తులో రంజిత్ సిన్హా వేలుపెట్టొద్దు : సుప్రీంకోర్టు

2జీ స్కామ్ దర్యాప్తులో సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హా వేలుపెట్టరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అదేసమయంలో కేసు విచారణను సీబీఐ ఉన్నతాధికారులతో జరిపించాలని ఆదేశాలిచ్చింది. సీబీఐ గౌరవం పెంపొందించేలా రంజిత్ వ్యవహరించడంలేదని, కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 
 
రంజిత్ సిన్హాపై ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలను ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ చేసిన విషయం తెల్సిందే. తమ సంస్థలకు 2జీ లైసెన్సులు ఇప్పించుకోడానికి నేరపూరిత కుట్రలు చేశారని ఆరోపణలున్న కంపెనీల అధికారులు రంజిత్ సిన్హాను తరచుగా ఆయన నివాసంలో కలుస్తున్నారని ప్రశాంత భూషణ్ ఆరోపించారు. 
 
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టులో విన్నివించుకున్నా కోర్టు తప్పించుకోలేదు. కేసు విచారణలో ఉన్నప్పుడు కొంతమందిని ఇంట్లో కలవడం ఎలాంటి నేరం కాదని ఆయన వాదించారు. మొత్తంమీద సీబీఐ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ఆదేశించింది.