శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (10:55 IST)

#ChildrensDay2019_ తీరిక లేకపోయినా నెహ్రూ పిల్లలతో గడిపేవారు..?

దేశవ్యాప్తంగా భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా వేడుకలా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రపంచదేశాలన్నీ నవంబర్‌ 20న బాలల దినోత్సవం జరుపుకొంటాయి. భారతదేశంలో మాత్రం నవంబర్‌ 14నే నెహ్రూ జన్మదినం రోజున బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 
 
1964 వరకు మిగతా దేశాలతోపాటు భారతదేశం కూడా నవంబర్‌ 20నే బాలలదినోత్సవం నిర్వహించేది. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత అతనికి పిల్లలపై ఉన్న ఎనలేని ప్రేమకు గుర్తుగా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్‌ 14ను బాలల పండుగగా చేసుకోవాలని భారతదేశం నిర్ణయించింది.
 
ప్రధానమంత్రిగా నెహ్రూ వివిధ కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ప్రతి రోజూ కొంతసమయాన్ని పిల్లలతో సరదాగా గడిపేవారు. పిల్లలపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు గుర్తుగా నవంబర్‌ 14ను బాలల దినోత్సవంగా గుర్తించారు.
 
దేశవ్యాప్తంగా పాఠశా లల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రకాల ఆట పాటలు, వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్‌ పోటీలు పెట్టి బహుమతులు ప్రదానం చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు ఆనందోత్సవాలతో పాల్గొంటారు. పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.  
 
భారత స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొని, దేశ తొలి ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన జవహర్ లల్ నెహ్రూ నవంబర్ 14, 1889న అలహాబాదులో జన్మించారు. పండిత్‌జీగా, చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందిన ఈయన గాంధీ- నెహ్రూ కుటుంబంలో ప్రముఖులు. దేశ ప్రధానిగా 17 సంవత్సరాలు పనిచేశారు.

ఈయన వారసులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. మే 27, 1964న నెహ్రూ మరణించారు. కాగా 65వ బాలల దినోత్సవాన్ని గురువారం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.