శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:53 IST)

రుణ గ్రహీతలకు వడ్డీ మాఫీ..రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు

కోవిడ్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక వత్తిళ్ళ నుంచి రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ థాకూర్‌ రాజ్యసభలో ప్రకటించారు. 

ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆగస్టు 6న బ్యాంక్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రుణ అర్హత కలిగిన వ్యక్తులు, కార్పొరేట్లు, చిన్నతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లకు చెందిన  మొండి బకాయిలు, రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు వ్యక్తిగతమైన పరిష్కార ప్రణాళికలను రూపొందించవలసిందిగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా రుణ గ్రహీతలకు వివిధ రూపాలలో ఊరట కల్పించడం జరిగిందని చెప్పారు. వడ్డీ రేట్ల మార్పు, వడ్డీ రూపంలో రావలసిన మొత్తాలను మాఫీ చేయడం, జరిమానా వడ్డీ మాఫీ వంటి చర్యలు రుణగ్రహీతలకు ఊరటనిస్తాయని మంత్రి చెప్పారు.

ద్రవ్యోల్బణం కారణంగా బ్యాంక్‌లలో డిపాజిట్ల పెరుగుదల రేటు పడిపోలేదని మరో ప్రశ్నకు జవాబుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. వాస్తవానికి ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జూన్‌ నాటికి బ్యాంక్‌లలో డిపాజిట్లు 9.5 శాతం నుంచి 11.5 శాతానికి పెరిగినట్లు చెప్పారు.