శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 మే 2016 (08:34 IST)

అగస్టాస్కామ్ : బ్లాక్‌మెయిల్‌ వద్దు.. దమ్ముంటే చర్యలు తీసుకోండి : ఏకే ఆంటోనీ

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోళ్లలో ముడుపులు స్వీకరణ అంశం పార్లమెంట్ ఉభయసభలను ఓ కుదుపు కుదుపుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇదేసమయంలో ఈ స్కామ్‌లో కాంగ్రెస్ నేతలకు హస్తమున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. 
 
ఇదే అంశంపై భారత రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ మాట్లాడుతూ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోళ్లలో అవినీతి నిజమని పునరుద్ఘాటించారు. అయితే, ఇందులో అప్పటి యూపీఏ ప్రభుత్వం పాత్రకానీ, తప్పుకానీ లేదని ట్విస్ట్ ఇచ్చారు. ఏదిఏమైనా... అవినీతి జరిగింది నిజం. చర్యలు తీసుకోండి. కానీ... బెదిరింపులకు దిగొద్దు అని ప్రధాని మోడీ సర్కారుకు సవాల్ విసిరారు. 
 
'అవినీతి జరిగిందనేది నిజం. ఇది వంద శాతం రుజువైంది. ఇటలీ కోర్టులో తీర్పూ వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. చర్యలు తీసుకోండి. అంతేకానీ, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడవద్దు. రాజకీయాలకు పాల్పడొద్దు. అలా చేస్తే పశ్చాత్తాపం తప్పదు' అని రాజ్యసభలో అన్నారు. 'ముడుపులు ఇచ్చిన కంపెనీపై, డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోండి. ఈ కంపెనీలను పదేళ్లు నిషేధించండి. వీలైనంత త్వరగా స్పందించండి. సందేహాలకు అతీతంగా, స్పష్టంగా అవినీతి రుజువైనందున వేల కోట్ల రూపాయలను పరిహారంగా పొందొచ్చు' అని ఆయన సూచించారు.