ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:51 IST)

తోటి ఉద్యోగి గే సెక్స్ కోసం ఒత్తిడి... వేధింపులు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య

ఆఫీస్‌లో తోటి ఉద్యోగి తనతో గే సెక్స్ చేయాలని బలవంతం చేయడంతో 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.  ఆత్మహత్యకు సూసైడ్ నోట్‌లో కారణాన్ని రాసి ఉంచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన నితేష్ వర్మ అనే 24 ఏళ్ల యువకుడు ఉద్యోగ నిమిత్తం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వెళ్లాడు. అహ్మదాబాద్‌లోని గాంధీనగర్‌లో కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. అదే ఆఫీస్‌తో పనిచేస్తున్న ఓ వ్యక్తి నితేష్‌ను ఇష్టపడ్డాడు. అతనితో శృంగారం చేయాలని భావించాడు. ఈ విషయంలో పలుమార్లు నితేష్‌ వద్దకు వచ్చి మీద చేతులేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. 
 
నితేష్‌కు ఆ వ్యక్తి ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా అనిపించింది. తనకు ఇష్టం లేదని.. తనను ఒత్తిడి చేయవద్దని ఆ వ్యక్తికి నితేష్ పలుమార్లు చెప్పినా సదరు వ్యక్తి వినిపించుకోలేదు. ఆఫీస్‌లో నితేష్ 'గే' అని ప్రచారం చేసి అందరి ముందు చెప్పాడు. ఈ పరిణామం నితేష్‌ను తీవ్రంగా బాధించింది. అందరూ నితేష్‌ను చూసి హేళన చేస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. 
 
ఇకనైనా.. తను చెప్పినట్టు వినాలని ఆ వ్యక్తి నితేష్‌ను బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోని నితేష్ ఈ పరిణామాలతో మానసికంగా కుంగిపోయాడు. నెల రోజుల నుంచి ఆఫీస్‌కు వెళ్లడం కూడా మానేసిన నితేష్ ఇంట్లోనే ఉన్నాడు. పిచ్చిపిచ్చిగా అరుస్తూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో.. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. మానసిక వైద్యులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంతలో నితేష్ ఆఫీస్‌కు రాకపోవడంపై అతని తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. మీ కొడుకు మానసిక స్థితి సరిలేదని, ఆఫీస్‌కు రాకపోవడమే మంచిదని చెప్పారు. 
 
అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న నితేష్ బుధవారం ఉదయం ఫ్యానుకు వేలాడుతూ శవమై కనిపించాడు. దీంతో.. పోలీసులకు సమాచారం అందడంతో సూసైడ్ చేసుకున్న రూమ్‌లో చూడగా నితేష్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన తోటి ఉద్యోగి వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.