గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (13:10 IST)

తమిళనాట సంచలనం... 89 మంది డీఎంకే ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా?

తమిళనాట పెనుసంచలనం చోటుచేసుకోనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును కాపాడేందుకు టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు శాసనసభ స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు.

తమిళనాట పెనుసంచలనం చోటుచేసుకోనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును కాపాడేందుకు టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు శాసనసభ స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. దీంతో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఇదిలావుంటే, ప్రధాన విపక్షమైన డీఎంకే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌పై మద్రాసు హైకోర్టు రేపు విచారణ జరుపనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డీఎంకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తోంది.
 
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలు అనర్హతకు గురైన నేపథ్యంలో తమ పార్టీకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలతో స్టాలిన్ మూకుమ్మడి రాజీనామా చేయించనున్నారని తెలుస్తోంది. అలా చేయడం ద్వారా మధ్యంతర ఎన్నికలకు వెళ్లవచ్చని, దీంతో అన్నాడీఎంకేను ఓడించవచ్చని డీఎంకే వ్యూహం రచించింది. 
 
వీరితో పాటు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డీఎంకేకు 89 మంది కాంగ్రెస్‌కు 8 మంది, ముస్లిం లీగ్‌కు ఒక సభ్యుడు, ఇద్దరు స్వతంత్రులతో కలుపుకుని మొత్తం 100 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా రాజీనామాలు చేస్తే ఈ చర్య రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారనుంది.