కరోనా కేసులు పెరుగుతున్నాయి.. కానీ ఆందోళన అక్కర్లేదు : ఎయిమ్స్ డైరెక్టర్
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నంత మాత్రా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. శనివారం దేశంలో 8329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.
ఈ పరిస్థితిపై రణ్‌దీప్ గులేరియా స్పందిస్తూ, దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరికలు, మరణాల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదన్నారు. ఈ పెరుగుదల కొన్ని భౌగోళిక ప్రాంతాలకే పరిమితమైవుందని, కేసులు పెరుగుతుండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
కాకపోతే కొవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు కొత్త వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా భారీగా పరీక్షలు చేయించడంపై దృష్టిపెట్టాలి. కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం పనికిరాదని.. బూస్టర్ డోసు వేసుకోవాలని ఆయన కోరారు.
మరోవైపు, ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ నివేదిక గుప్తా స్పందిస్తూ, కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని (ప్రికాషన్ డోసుతో సహా) సూచించారు. టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గడంతో పాటు ఆస్పత్రి చేరికలను నివారించవచ్చన్నారు.