గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (20:01 IST)

అయోధ్య ట్రస్టులో సభ్యులుగా అమిత్ షా, యోగి!

అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్టు ఏర్పాటుపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆ ట్రస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను సభ్యులుగా చేర్చాలని విశ్వహిందూ పరిషత్ సిఫార్సు చేసింది.

ఇందుకు అవసరమైతే నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. గతంలో సోమ్నాథ్ ట్రస్ట్లో అప్పటి కేంద్ర మంత్రి కేఎం మున్షీని సభ్యునిగా చేర్చడాన్ని వీహెచ్పీ గుర్తుచేసింది. రామ మందిరం ట్రస్టునూ అదే తరహాలో ఏర్పాటు చేయాలని కోరింది.

రామజన్మభూమి న్యాస్(ఆర్జేఎన్) రూపొందించిన ప్రణాళిక ప్రకారం ట్రస్టు గొప్ప ఆలయాన్ని నిర్మిస్తుందని వీహెచ్పీ ప్రతినిధి శరద్ శర్మ ఆశాభావం వ్యక్తంచేశారు. 30 ఏళ్లుగా.... అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఖాయమన్న ధీమాతో 1990 నుంచి కర్సేవక్పురంలో కార్ఖానా నిర్వహిస్తోంది ఆర్జేఎన్. ఎంతో మంది కళాకారులు గడిచిన సంవత్సరాలలో అద్భుత శిల్పాలు, గుడికి అవసరమయ్యే స్తంభాలను చెక్కారు.

268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 128 అడుగుల ఎత్తుతో మందిర నిర్మాణానికి ఆర్జేఎన్ ప్రణాళిక రూపొందించింది. ఆలయ నిర్మాణానికి 212 స్తంభాలు అవసరమవుతాయని అంచనా.

ఇప్పుడు ఇదే నమూనా ప్రకారం మందిర నిర్మాణం జరగాలని ఆర్జేఎన్, వీహెచ్పీ ఆశిస్తున్నాయి. కర్సేవక్పురంలో కార్ఖానా మొదలు పెట్టిన దాదాపు 30ఏళ్ల నుంచి రామ మందిర నమూనాను అనేక సమాచార మార్గాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము.

వీటిని భక్తులు ఫొటోలు, వీడియోలను తీసుకొని ప్రచారం చేశారు. కాబట్టి ప్రజల దృష్టిలో రామమందిర నిర్మాణంపై ఈ నమూనానే ఊహించుకుంటారు.