పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సంస్థకు చెందిన అగ్ర నేతతో పాటు ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టి పైచేయి సాధించింది. ఈ నెల 5వ తేదీన కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీనికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాదుల మృతదేహాలను గుర్తించాల్సివుంది. పరిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు నుంచి ఆర్మీ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన తీవ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపాయి. ప్రతిగా సైన్యం కూడా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఒక జవాను గాయపడ్డారు.