గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (10:54 IST)

అటల్‌ బిహారి వాజ్‌పేయి వర్ధంతి: మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం..!

భార‌త‌ మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని అటల్‌ సమాధి స్థల్‌లో శ్రద్ధాంజలి ఘటించారు. అనంత‌రం కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.
 
దేశానికి వాజ్‌పేయి అందించిన సేవ‌లు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ట్వీట్ చేశారు. దేశానికి వాజ్‌పేయి అందించిన సేవ‌ల‌ను, ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని, గొప్ప‌త‌నాన్ని గుర్తు చేసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయ‌న ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌న‌సులో ఉండిపోతార‌ని చెప్పారు.
 
ఆగస్ట్ 16 2018 సంవత్సరంలో 93 ఏళ్ల వయసులో వాజ్ పేయి ఎయిమ్స్ లో వయో భారం, అనారోగ్య తదితర కారణాలతో కన్నుమూశారు. కాగా.. సదైవ్ అటల్ మెమోరియల్ ను ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఈ నిర్మాణానికి నిధులను అటల్ స్మృతిన్యాస్ సొసైటీ అందించింది.
 
ఇకపోతే.. అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25 1924 న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళాడు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు, కవి. 
 
సంతానం లేని వాజపేయి, నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయనకు భారతీయ సంగీతం, నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం. వాజపేయి వేలాదిమంది ముందు, పార్లమెంటులోనూ కవితాత్మకంగా, జనరంజకంగా, పలు విషయాలు ప్రస్తావిస్తూ ప్రసంగించేవారు. అప్పటికి స్వాతంత్ర్యోద్యమ నేతగా, భారత ప్రధానిగా రాణించారు.