బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (09:55 IST)

ఎన్సీపీ మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కాల్చివేత.. ముంబైలో కర్ఫ్యూ...

baba siddique
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన సీనియర్ నేత బాబా సిద్ధిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ముంబైలోని బాంద్రాలో ఆయనపై దుండగులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయల షూటర్లు ఆయనపైకి ఆరు బుల్లెట్లు కాల్చగా, బాబా సిద్ధిక్‍‌కు నాలుగు బుల్లెట్లు తగిలాయి. బాబా సహాయకుల్లో ఒకరు గాయపడ్డారు కూడా. 
 
కాగా, తన కుమారుడు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషాన్ కార్యాలయాని సమీపంలోనే బాబాపై కాల్పులు జరగడం గమనార్హం. కాల్పులు జరిపిన వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, బాబా హత్య నేపథ్యంలో ముంబైలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. 
 
బాబా సిద్ధిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004-2008 మధ్య రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఈ యేదాది ఫిబ్రవరిలోనే హస్తం పార్టీని వీడి అజిత్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరారు. మరోవైపు ఆయన కొడుకు జీషాన్ సిద్దిక్‌కు ఈ యేడాది ఆగస్టులో పార్టీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది.
 
బాబా సిద్ధిక్ హత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. 'ఈ ఘటన చాలా దురదృష్టకరం. సిద్ధిక్ చనిపోయారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు ఉత్తరప్రదేశకు చెందినవారు, మరొకరు హర్యానాకు చెందినవారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడం జరిగింది. ముంబైలో శాంతిభద్రతలను ఎవరూ వారి చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు" అని ఆయన అన్నారు.
 
మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. సిద్ధిక్ హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాబా సిద్దిక్ హత్యపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.