గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (14:15 IST)

ఢిల్లీలో స్కూటీపై పెళ్లి కుమార్తె రీల్స్ - రూ.6 వేలతో అపరాధంతో పోలీసుల చదివింపులు

bride
మరికొన్ని గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వధువుకు పోలీసులు ఆరు వేల రూపాయల ఫైన్‌ విధించి, ఈ పెళ్లికి ఇవే మా చదివింపులు అని చెప్పకనే చెప్పారు. పైగా, ఇంకెపుడూ ఇలాంటి సాహసాలు బైకుపై చేయొద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. ఢిల్లీలో బైకు‌పై రీల్స్ చేసిన ఓ వధువుకు పోలీసులు రూ.6 వేల అపరాధం విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలో ఓ పెళ్లి కుమార్తె అందంగా ముస్తాబై మండపానికి బయలుదేరింది. అందరిలా అలంకరించిన కారులో వెళితే తన ప్రత్యేక ఏముందని అనుకుందో ఏమోగానీ వెరైటీగా స్కూటీపై బయలుదేరింది. పనిలోపనిగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెళ్ళి కుమార్తె ముస్తాబులో పెళ్ళి బట్టలు ధరించి స్కూటీ నడుపుతున్న ఈ వీడియో కాస్త వైరల్ అయింది. 
 
ఈ వీడియోను ఆహ్వానంగా భావించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పెళ్ళికైతే వెళ్లలేదు గానీ, చదివింపుల రూపంలో రూ.6 వేల అపరాధం విధించారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు రీల్స్ కోసం రోడ్లపైన ప్రమాదకరంగా ప్రయాణించదన్న కారణంతో ఈ మొత్తం ఫైన్ వేశారు. పైగా, వైరల్‌గా మారిన ఈ వీడియోను పోలీసులు తమ ప్రచారం కోసం వినియోగించుకున్నారు. 
 
సదరు యువతి ముఖం, స్కూటీ నంబరు ప్లేటును కనిపించకుండా చేసి ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. వేడుకల పేరుతో ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తే మీకూ చదివింపుల తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, హెల్మెంట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.