గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (14:21 IST)

బెంగుళూరులో హోటల్ గది అద్దె రోజుకు రూ.40 వేలా?

hotel room
దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం వర్షానికి తడిసి ముద్దయిపోయింది. ఈ నగరంలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. నగర రహదారులన్నీ చిన్నపాటి చెరువులను, వాగులు వంకలను తలపిస్తున్నాయి. దీంతో అనేక బడా కోటీశ్వరులు తమ గృహాలను వీడి హోటల్స్, లాడ్జిలకు మకారం మార్చుతున్నారు. దీంతో హోటల్ గదుల అద్దె ఒక్కసారిగా ఆకాశానికి తాకింది. 
 
బెంగుళూరు నగరంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగుళూరులోని హోటళ్ళకు బాగా కలిసివచ్చింది. ఐటీహబ్‌ను వరదలు ముంచెత్తడంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలను సమస్యలు చుట్టుముట్టాయి. 
 
తాగేందుకు నీరు కూడా దొరకకపోవడంతో వారంతా హోటళ్లకు క్యూ కడుతున్నారు. వరదలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు ఒక్కసారిగా రూముల ధరలను పెంచేశాయి.
 
హోటలు గదికి ఇప్పటివరకు రోజుకు రూ.10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తుండగా, తాజాగా ఈ ధరలను రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పెంచేశాయి. వరదలకు దెబ్బతిన్న వైట్‌ఫీల్డ్, అవుటర్ రింగ్‌రోడ్డు, ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు, కోరమంగళ తదితర ప్రాంతాల్లో హోటళ్లలోని గదులన్నీ శుక్రవారం వరకు బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది. 
 
ఇక, ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డులోని లీలా ప్యాలెస్‌లో ప్రస్తుతం ఓ గది ప్రారంభ ధర రూ.18,113 ఉండగా, తాజ్ బెంగళూరులో డీలక్స్ గది బుకింగ్ కోసం పన్నులు కలుపుకుని రోజుకు రూ.14,750 వసూలు చేస్తున్నారు. ఊరట ఇచ్చే విషయం ఏమిటంటే ఓయో హోటళ్లలో ధరలు మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ ధర రూ.1200 కంటే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.