రాజస్థాన్ మందు బాబులకు శుభవార్త... రూ.30లకే బీర్ బాటిల్
రాజస్థాన్ మందు బాబులకు శుభవార్త. ఆ రాష్ట్రంలో బీర్ తక్కువ రేటుకు లభించనుంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా రెవెన్యూ తగ్గడంతో బీర్ల అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ పాలసీలో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం బీర్ల ధరలు.. రూ. 30 నుంచి రూ.35 వరకు తగ్గనున్నాయి. బీర్ బ్రాండ్‌ను బట్టి ధరలు మారనున్నాయి.
కరోనా కాలంలో రాజస్థాన్‌లో బీర్లు తాగేందుకు మందుబాబులు ఎక్కువగా ఆసక్తి చూపలేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఎందుకంటే బీర్ల రేట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్‌చార్జ్ పెంచడంతో పెద్దగా వాటిపై మొగ్గు చూపలేదు. ఈ క్రమంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో అదనపు ఎక్సైజ్ సుంకం, కోవిడ్ సర్‌చార్జ్‌ను తగ్గించారు. 2019-20 ఏడాదిలో 2 కోట్ల 65 లక్షల బీర్ల కేసులు అమ్ముడు పోయాయి.
2020-21లో ఆ సంఖ్య ఒక కోటి 60 లక్షలకు తగ్గింది. కేవలం 95 లక్షల బీర్ల కేసులు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. ఈ నేపథ్యంలో బీర్ల అమ్మకాలను పెంచి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే విధంగా వాటి ఎమ్మార్పీ ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్‌చార్జ్ ను ఎత్తేశారు.