యువకుడు ప్రమాదకర రీల్స్ ... ఆగ్రహంతో స్కూటర్ లాక్కొని వంతెనపై నుంచి కిందపడేశారు.. (Video)
ఇటీవలి కాలంలో రీల్స్, సెల్ఫీల మోజులో అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. రీల్స్ కోసం ప్రమాదకరంగా స్టంట్స్ చేయడం, జలపాతాల వద్దకు వెళ్లడం కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటువంటి ఘటనలు సంబంధించి వార్తలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా యువతలో మార్పు రావడం లేదు.
తాజాగా బెంగుళూరు - తుముకూరు జాతీయ రహదారిపై రోడ్డు మధ్యలో స్కూటర్‌తో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తున్న యువకుడికి స్థానికులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని అడ్డుకుని వాహనాన్ని లాక్కుని వంతెనపై నుంచి కిందకు పడేశారు. అంతెత్తు నుంచి రోడ్డుపై పడటంతో ఆ స్కూర్ కాస్త తుక్కుతుక్కు అయింది. యువకుడు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేయడంతో ఇతర వాహనదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. అందరూ కలిసి అతడిని అడ్డుకుని స్కూటర్ లాక్కొని వంతెనపై నుంచి అమాంతం ఎత్తిపడేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే ఇంకొకటి జరిగింది. ఓ యువతి ఆరో అంతస్తు నుంచి రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా చేతిలోనుంచి మొబైల్ జారిపోయింది. దీంతో దానిని పట్టుకునే ప్రయత్నంలో ఆ యువతి అదుపుతప్పి కందపడి ఆమె తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.