1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జులై 2025 (19:15 IST)

టీవీ నటి శ్రుతిపై భర్త హత్యాయత్నం.. కత్తితో పొడిచి పారిపోయాడు.. చివరికి?

Bengaluru TV actress Shruthi
Bengaluru TV actress Shruthi
టీవీ నటి శ్రుతిపై హత్యాయత్నం జరిగింది. ఆమె భర్తే ఆమెపై దాడి చేశాడు. కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హనుమంతనగర్ ప్రాంతంలో జులై 4న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించిన వివరాల్లోకి వెళితే.. అమరేష్‌, శ్రుతిలకు 20 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. 
 
వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే గత 15 సంవత్సరాలుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మూడు నెలల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా గృహహింస కేసు కూడా నమోదైంది. 
 
శ్రుతి ఏప్రిల్‌లో అమరేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం తన సోదరుడి ఇంట్లో ఉంటోంది. ఇటీవల, అమరేష్ మారిపోయానని చెప్పి ఆమెను తిరిగి తనతో కలిసి ఉండేలా ఒప్పించి తీసుకువెళ్లాడు. జులై 04వ తేదీన వారి ఇద్దరు కుమార్తెలు కళాశాలకు వెళ్లాక అమరేష్ పెప్పర్ స్ప్రే, కత్తితో తనపై దాడి చేశాడని శ్రుతి తన వాంగ్మూలంలో పేర్కొంది. 
 
స్థానికుల సహాయంతో శ్రుతి ఆస్పత్రిలో చేర్చబడింది. ఆపై చికిత్స అందించడంతో డిశ్చార్జ్ అయ్యింది. అమరేష్‌ ఆటో డ్రైవరు కాగా, శ్రుతి పలు సీరియల్స్‌లో నటించింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.