శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (17:02 IST)

భార్య ముందు అంకుల్ అని పిలిచాడనీ షాపు కీపర్‌పై దాడి చేసిన భర్త!!

తన భార్య ముందు అంకుల్ అని పిలిచాడని షాపు కీపర్‌పై భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్ నగరానికి చెందిన విశాల్ శాస్త్రికి స్థానికంగా జాట్ ఖేడి ప్రాంతంలో వస్త్ర దుకాణం ఉంది. శనివారం ఎప్పటిలాగే తన షాపులో కూర్చున్న శాస్త్రి.. వచ్చిన కస్టమర్లకు బట్టలు చూపిస్తున్నాడు. 
 
ఇంతలో భుజాన చంటిపిల్లాడితో ఓ జంట వచ్చింది. చీరలు కావాలనడంతో శాస్త్రి తన షాపులోని వివిధ వెరైటీలను చూపించాడు. ఈ క్రమంలోనే అంకుల్ మీకు ఏ ధరలో కావాలో చెప్పాలంటూ శాస్త్రి కస్టమర్‌ను అడిగాడు. తన భార్య ముందే తనను అంకుల్ అని పిలవడంపై సదరు కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాస్త్రితో వాగ్వాదానికి దిగాడు. 
 
అతడి భార్య సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. గొడవ ముగిసిందని అనుకునేలోపే సదరు కస్టమర్ తన స్నేహితులతో వచ్చి శాస్త్రిపై దాడి చేశాడు. షాపులో నుంచి శాస్త్రిని బయటకు లాగి బెల్ట్, రాడ్, హాకీ స్టిక్‌లతో చితకబాదారు. ఇదంతా షాపు ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. శాస్త్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు కస్టమర్‌ను రోహిత్‌గా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.