శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (12:26 IST)

కొందరు ఎమ్మెల్యేను లాగి ఒంగోబెడితే.. మరికొందరు పిడిగుద్దులు కురిపించారు.. ఎక్కడ.. ఎందుకు?

దేశంలో గోవధ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. గోవధ నిషేధం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాద్రి సమీపంలోని బిషాదా అనే గ్రామంలో ఆవును చంపి ఆ మాంసాన్ని తిన్నాడన్న కోపంతో ఓ ముస్లిం కుటుంబంపై గ్రామస్తులంతా దాడి చేయగా, ఆ కుటుంబ యజమాని మృతి చెందాడు. ఈ ఘటనపై దేశం అట్టుడికి పోతోంది. రాజకీయ నేతల మధ్య మాటలు తూటాలై పేలుతున్నాయి.
 
 
ఈ నేపథ్యంలో ఓ ముస్లిం వర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే కావాలనే తన సన్నిహితులకు బీఫ్ పార్టీ ఇచ్చారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం చెందారు. అంతే గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆ స్వతంత్ర అభ్యర్థిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభలో గురువారం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
స్వతంత్ర ఎమ్మెల్యే అయిన షేక్ అబ్దుల్ రషీద్ శ్రీనగర్‌లోని ఎమ్మెల్యే హాస్టల్‌లో కొందరికి ఆవు మాంసంతో విందు భోజనం పెట్టాడు. అంతటితో ఆగని ఆయన గోమాంసం నిషేధంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోమాంసంపై నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవలే ఆదేశించింది. ఈ క్రమంలో బుధవారం బీఫ్ పార్టీ ఇచ్చిన రషీద్, ‘‘ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికే కాక కోర్టులకూ లేదు. తాము తినాలనుకున్న దాని తినకుండా ప్రజలను ఎవరూ అడ్డుకోలేరు’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన వ్యాఖ్యలు బీజేపీ ప్రజాప్రతినిధుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. గురువారం ఎప్పటిలానే సభకు వచ్చిన రషీద్‌ను బీజేపీ సభ్యులు కొందరు లాగి ఒంగోబెట్టారు. మరికొందరు వెనుకవైపు చేసి పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడి అసెంబ్లీ సాక్షిగా జరిగింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ లు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.