గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (17:33 IST)

సహజీవనం ఎంతో ప్రమాదకరమైన జబ్బు : బీజేపీ ఎంపీ

illegal relationship
నేటి ప్రపంచంలో ఓ ట్రెండ్‌గా మారిన లివింగ్ రిలేషన్ (సహజీవనం) అనేది ఒక ప్రమాదకరమైన జబ్బు అని భారతీయ జనతా పార్టీ ఎంపీ ధరంవీర్ సింగ్ అన్నారు. ఈ చెడు విధానాన్ని సమాజం నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈయన.. గురువారం జీవో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం అధికంగా ఉంటోందన్నారు. 
 
'తీవ్రమైన ఈ అంశాన్ని ప్రభుత్వం, పార్లమెంటు దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ‘వసుధైవ కుటుంబకమ్‌’ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మాణం కూడా భిన్నమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం అధికంగా ఉంటోంది. వివాహ బంధం విషయంలో వధూవరుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
 
సహజీవనం అనేది ప్రస్తుతం సమాజంలో ఓ ప్రమాదకరమైన జబ్బుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల్లో ఇది సాధారణమే అయినప్పటికీ.. మనదేశంలో కూడా ఈ తరహా బంధాలు పెరుగుతున్నాయన్నారు. వీటి పరిణామాలు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటున్నాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌-అఫ్తాబ్‌ పూనావాల కేసును ఆయన ఉదహరించారు. ఈ నేపథ్యంలో సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని.. తద్వారా ఈ ప్రమాదకరమైన వ్యాధిని సమాజం నుంచి నిర్మూలించగలమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.