ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (12:51 IST)

గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం - హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్

himachal pradesh election
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ నెలకొల్పిన రికార్డు ఇపుడు బద్ధలైపోయింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న మొత్తం 182 సీట్లకుగాను బీజేపీ ఒక్కటే ఏకంగా 154 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తుంది. అలాగే, కాంగ్రెస్ 19, ఆప్ 6, ఇతరులు మూడుస్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేయనుంది. 
 
దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గాంధీ నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు అపుడే సంబరాలు మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయంలో డెకరేషన్ పనులు చేపట్టారు. స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా, గత 27 యేళ్లుగా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇపుడు మరోమారు అధికారంలోకి రానుంది.
gujarath
 
అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు తమ ఆనవాయితీని మరిచిపోలేదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి వరుసగా మరోమారు అధికారం కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ వారు అదే పని చేశారు. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి, కాంగ్రెస్ పార్టీకి మరోమారు అవకాశం కల్పించారు 
 
మొత్తం 68 సీట్లకుగాను ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 35. గురువారం చేపట్టి ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ 40 చోట్ల, బీజేపీ 25 చోట్ల, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తేలిపోయింది. అయితే, ఈ ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విజయం దోబూచులాడింది.