దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవే : మనీశ్ తివారీ
దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవేనని, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీగా మరోమారు బాధ్యతలు స్వీకరిస్తే దేశంలో ప్రత్యక్ష ఎన్నికలంటూ ఉండవలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మన దేశానికి చివరి ఎన్నికలు ఇవే అవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే ఆయనను నిలువరించడానికి ఇండియా కూటమి బరిలో నిలిచిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని వ్యాఖ్యానించారు.
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ నాలుగో తేదీన విపక్ష కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు తథ్యమని తాము తొలి దశ పోలింగ్ నుంచే ఇదే చెబుతున్నామన్నారు. బీజేపీ దక్షిణాన కనుమరుగు కానుందని, ఉత్తరాదిన సగానికే పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.