1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (16:48 IST)

కరిచిన పామును బ్యాగులో వేసుకుని వెళ్లిన బాలుడు... షాక్ తిన్న ఆసుపత్రి సిబ్బంది

పామును చూస్తే మనం ఆమడదూరం పారిపోతాం. కానీ ఓ సాహస బాలుడు మాత్రం తనను కరిచిన పామును గట్టిగా పట్టుకుని ఏకంగా తన బ్యాగులో వేసి జిప్ వేసేశాడు. ఆ పాముతో సహా ఆసుపత్రికి వెళ్లి తనకు చికిత్స చేయాల్సిందిగా వైద్యులను కోరాడు. వివరాల్లోకి వెళితే... ఉత్తర కన్నడ జిల్లాలోని బెలాబందర్ గ్రామానికి చెందిన సందేష్ నాయక్ అనే 11 ఏళ్ల బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు. తన ఇంటికి బయటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా అతడిని ఓ పాము మోకాలిపై గట్టిగా కరిచింది. దాంతో ఆ పామును గట్టిగా పట్టుకున్న బాలుడు దాన్ని తీసుకెళ్లి ఓ బ్యాగులో వేసి జిప్ వేసేశాడు. 
 
తనను పాము కరిచిందనీ, కరిచిన పాము తన బ్యాగులోనే ఉన్నదని ఆసుపత్రి సిబ్బందితో చెప్పడంతో వారంతా బెంబేలెత్తిపోయారు. కానీ ఆ తర్వాత అతడిని పరీక్షించిన వైద్యులు, అతడిని కరిచింది విష సర్పం కాదని నిర్థారించుకున్నారు. ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం పామును వదిలివేసేందుకు వారు ప్రయత్నించగా తనను కరిచిన పామును ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఆ బాలుడు భీష్మించాడు. చివరకి తన తండ్రి అతడి బ్యాగు నుంచి పామును వెలికి తీసి సంబంధిత అధికారులకు అప్పగించాడు.