1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (17:33 IST)

తేజ్ బహదూర్ యాదవ్‌‌పై వేటు.. విధుల నుంచి తొలగింపు.. న్యాయపోరాటానికి సై

బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు కష్టాలు తప్పట్లేదు. సరిహద్దుల్లో భారత జవాన్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారంటూ.. ఏరోజు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో.. అప్పటినుంచి ఆయనకు పై అధికారుల నుంచ

బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు కష్టాలు తప్పట్లేదు. సరిహద్దుల్లో భారత జవాన్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారంటూ.. ఏరోజు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో.. అప్పటినుంచి ఆయనకు పై అధికారుల నుంచి వేధింపులు.. రాజీనామా చేయమని ఒత్తిడి పెరుగుతోందని ఆయన సతీమణి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తేజ్ బహదూర్ యాదవ్‌ను విధుల నుంచి తొలగించారు. సైన్యంలో క్రమశిక్షణ తప్పాడంటూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడంటూ వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో అతనిపై చర్యలు తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
ఇకపోతే.. జమ్మూ కాశ్మీర్ సాంబా జిల్లాలోని మార్షల్ కోర్టులో తేజ్ బహదూర్‌పై మూడు నెలలపాటు విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్ ప్రతిష్టను తేజ్ బహదూర్ మంటగలిపాడన్నారు.

ఆర్మీలో సైనికులకు ఉద్దేశించిన ఆహారాన్ని సీనియర్ అధికారులు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించి వీడియోను విడుదల చేయడం నిబంధనలను ఉల్లంఘించినట్లేనని ఉన్నతాధికారులు చెప్పారు. 
 
అయితే తేజ్ బహదూర్ మాత్రం తనను విధుల నుంచి తొలగించడంపై న్యాయపోరాటం చేస్తానంటున్నాడు. ఉన్నతాధికారులు చేస్తున్న నిజాలను బయటపెట్టాననే కక్షతోనే తనను విధుల నుంచి తొలగించారంటూ తేజ్ అంటున్నాడు. హర్యానాలోని మహేంద్రగడ్ జిల్లాకు చెందిన ఈ జవాన్ తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటానని చెప్తున్నాడు.