శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (09:32 IST)

తమిళనాడు సచివాలయాన్ని పలకరించిన కరోనా వైరస్..

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరినీ సోకిన కరోనా.. ప్రస్తుతం తమిళనాడు సచివాలయాన్ని కూడా పలకరించింది. చెన్నై సెయింట్‌ జార్జి కోట ప్రాంగణంలోని సచివాలయానికి 'కరోనా' షాక్‌ తగిలింది. పలు విభాగాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగుల రక్తనమూనాలను పరీక్షించగా పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది.
 
70 రోజుల అనంతరం లాక్‌డౌన్‌ సడలించిన కారణంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల కార్యాలయాల్లో ప్రస్తుతం 50 శాతం మంది ఉద్యోగులు భౌతికదూరం పాటిస్తూ విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ కావడంతో ఉద్యోగుల హాజరు 33 శాతానికి తగ్గించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి సచివాలయ ఉద్యోగుల సంఘం మంగళవారం విజ్ఞప్తి చేసింది.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడుతో కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది ఉంది. తాజాగా 1,091 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో వైరస్‌ బాధితుల సంఖ్య 24,586కు చేరింది. అలాగే, మరణాల సంఖ్య 197కు చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనీస్వామి మాట్లాడుతూ.. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పేట వంటి ప్రాంతాలు మినహా రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. 
 
ముఖ్యంగా చెన్నైలోని మురికివాడల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులతో సీఏం సమావేశం నిర్వహించారు. రోజువారి కరోనా పరీక్షల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు.