ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా
ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోవడంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఈ మేరకు తీరత్ సింగ్ శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు. రాజ్యాంగ సంక్షోభం దృష్ట్యా, తాను రాజీనామా చేసినట్లు తీరత్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు తనకు ఇచ్చిన ప్రతీ అవకాశానికి కేంద్ర నాయకత్వం, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ తీరత్ సింగ్ రావత్ ప్రకటించారు.
అయితే.. సీఎం తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గవర్నర్ బేబీ రాణి మౌర్య ట్వీట్ చేసి వెల్లడించారు. కాగా.. ఆరు నెలల్లో తీరత్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికే ఆయన ఎమ్మెల్యే కాదు.
భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం సూచనల మేరకు తీరత్‌సింగ్ పదవికి రాజీనామా చేశారు.