పండగ సమయాల్లో కొత్త నియమ నిబంధనలు : యూపీ సర్కారు వెల్లడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పండుగల సమయాల్లో భక్తులు, విశ్వాసులు అనుసరించాల్సిన నిబంధనలను జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అన్ని మతాల వారికి కొన్ని షరతులు విధించింది.
శ్రావణి శివరాత్రి, నాగ పంచమి, రక్షాబంధనం, బక్రీద్, మొహరం పండుగలను చేసుకునేవారు ప్రజాప్రయోజనాల రీత్యా వ్యవహరించవలసిన పద్ధతులను తెలిపింది. భక్తులకు అందజేయవలసిన సదుపాయాలు, భద్రతా చర్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. శాంతిభద్రతలను కాపాడేవిధంగా ఈ పండుగలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని, రోడ్డు భద్రతలను పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత అమలుపై సంబంధిత మత పెద్దలు, విద్యావేత్తలతో స్థానిక అధికారులు చర్చలు జరపాలని సీఎం అదేశించారు.
అలాగే, వివాదాస్పద స్థలాల్లో బక్రీద్ సందర్భంగా బలులు ఇవ్వడాన్ని నిషేధించారు. బలి ఇచ్చే ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించాలని, ఇతర చోట్ల బలి ఇవ్వరాదన్నారు. కన్వర్ యాత్ర సంప్రదాయబద్ధంగా, సురక్షితంగా జరగడానికి సూచనలు చేశారు. ఈ యాత్ర జరిగే మార్గాల్లో మాంసం, మాంసపు ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు.