సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (15:40 IST)

కో-ఆపరేటివ్ బ్యాంకు ఓటర్ల జాబితాలో కరుణానిధి పేరు

డీఎంకే మాజీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం. కరుణానిధి పేరు ఓటర్ల జాబితాలో ఉంది. ఆయన అనారోగ్యం కారణంగా చనిపోయి ఒక యేడాది పూర్తయింది. ఇటీవలే ఆయన తొలి వర్థంతి వేడుకలను కూడా డీఎంకే ఘనంగా నిర్వహించింది. కానీ, కరుణానిధి పేరు మాత్రం ఓటర్ల జాబితాలో ఇప్పటికీ ఉంది. దీనివెనుక కథను తెలుసుకుందాం. 
 
తిరువారూర్‌లో సహకార బ్యాంకు ఎన్నికల ఓటర్ల జాబితాను ఇటీవల వెల్లడించారు. ఇందులో డీఎంకే దివంగత అధ్యక్షుడు కరుణానిధి పేరు ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. తిరువారూర్‌ ఉత్తర వీధిలోని కమలాంబిక సహకార పట్టణ బ్యాంకు 109 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఈ బ్యాంకులోనే తొలిసారిగా సభ్యుడిగా చేరారు. 
 
ఈ బ్యాంకుకు నిర్వాహ కమిటీ సభ్యుల ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఓటర్ల జాబితాలో 14,817 మంది పేర్లు ఉండగా అందులో మాజీ అధ్యక్షుడు కరుణానిధి పేరు ఉండటం వివాదాస్పదమైంది. ఓటర్ల జాబితాలో దక్షిణ వీధి, ముత్తువేల్‌ కుమారుడు కరుణానిధి అని స్పష్టంగా ఉంది. అలాగే కరుణానిధి మిత్రుడు తెన్నన్‌ పేరు కూడా ఉండటం గమనార్హం. 
 
దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించి కొత్త ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కరుణానిధి బ్యాంకు ఖాతా ఇంకా మూసివేయకపోవడంతో ఆయన పేరు ఓటర్ల జాబితాలో ఉన్నట్టు సహకార బ్యాంకు నిర్వాహకులు వివరణ ఇచ్చారు.