గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (12:14 IST)

ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్... ప్రత్యేక వైద్య బృందాన్ని పంపనున్న కేంద్రం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఫలితంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలకు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా వుంది. ఇక్కడ ప్రతి రోజూ 20 వేల‌కు పైగా క‌రోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. జులై 31, ఆగ‌స్టు 1న లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు వివ‌రించింది. 
 
మరోవైపు, కేర‌ళ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైద్య బృందాన్ని పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ అంటు వ్యాధుల నియంత్ర‌ణ సంస్థ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఆరుగురు స‌భ్యుల వైద్య‌ బృందం ఆ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే చేరుకుంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనాపై పోరులో కేర‌ళ ప్ర‌భుత్వానికి ఈ బృందం స‌హాయ‌ప‌డ‌నుంది.
 
క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్ష‌ల విధింపుపై మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేర‌ళ‌లో ప్రతి రోజూ 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మ‌ర‌ణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో కేర‌ళ స‌ర్కారు లాక్‌డౌన్ విధించాల‌ని గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.