శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (21:34 IST)

సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ఆపండి... ప్రధాని మోడీకి ప్రతిపక్షాల ఉమ్మడి లేఖ

దేశంలో విజృంభిస్తున్న కరోనా పరిస్థితులపై రాష్టాల ముఖ్యమంత్రులంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి మూకుమ్మడి లేఖ రాశారు. కరోనా మహమ్మారి వల్ల దేశం అల్లకల్లోలం అవుతోందని, ఇంతకుముందెన్నడూ చూడని విపత్కర పరిస్థితులు సంభవిస్తున్నాయని వారు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇంతకుమందు కూడా తాము కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యల గురించి అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని, కానీ ఏనాడూ పట్టించుకోలేదని, దానివల్లే ఇప్పుడు ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తోందని తమ లేఖలో ముఖ్యమంత్రలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అయితే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ముందు జరగాల్సిన దాని గురించి చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నామని, కరోనాను నియంత్రించాలంటే యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన అనేక చర్యలను ఇందులో పొందుపరిచామని, దీనిపై కేంద్రం దృష్టి సారించి వెంటనే తీసుకోవాల్సిన చర్యల తీసుకోవాలని సూచించారు. 
 
ప్రధాని మోడీకి ఉమ్మడి లేఖ రాసిన ముఖ్యమంత్రుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ ఈ లేఖను కేంద్రానికి రాశారు. 
 
వీరితో పాటు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీహార్ ప్రతి పక్ష నేత తేజస్వి యాదవ్, సీపీఐ కార్యదర్శి డి.రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఈ లేఖలో భాగస్వాములుగా ఉన్నారు.
 
అదేసమయంలో కేంద్రానికి రాష్ట్రాల సీఎంలు చేసిన సూచనలు:
* అవకాశమున్న ప్రతి చోటి నుంచి వ్యాక్సిన్ నిల్వలను తెప్పించాలి. 
* దేశంలోని ప్లాంట్‌ల నుంచి, విదేశాల నుంచి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి వ్యాక్సిన్‌లను తెప్పించి దేశంలో నిల్వలను పెంచాలి. 
* దేశవ్యాప్తంగా వెంటనే మూకుమ్మడి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రారంభించాలి. అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందిచాలి.
* వ్యాక్సిన్‌లు తయారు చేసే సంస్థలకు ఖచ్చితంగా లైసెన్సింగ్ ఉండాలనే నిబంధనలను తొలగించాలి.
* వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లను ఖర్చు చేయాలి.
* సెంట్రల్ విస్టా(పార్లమెంట్ కొత్త భవనం) నిర్మాణాలను నిలిపివేయాలి. దానికి కేటాయించిన నిధులను ఆక్సిజన్, వ్యాక్సిన్ నిల్వలను సమకూర్చుకోవడం కోసం వినియోగించాలి. 
* పీఎం కేర్స్ ఫండ్‌లో ఉన్న మొత్తం సొమ్మును బయటకు తీసి వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మెడికల్ ఎక్విప్‌మెంట్‌లను కొనుగోలు చేయాలి. 
* నిరుద్యోగులందరికీ నెలకు కనీసం రూ.6000 చొప్పున ఇవ్వాలి.
* కేంద్ర గోడౌన్‌లలో ఇప్పటికే కోటి టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ కుళ్లిపోతున్నాయి. వాటిని బయటకు తెచ్చి పేదలకు ఉచితంగా పంచిపెట్టాలి.
* కరోనా మహమ్మారి దెబ్బకు అన్నదాతలు బలికాకుండా ఉండాలంటే వెంటనే రైతు చట్టాలను తొలగించాలి. దీనివల్ల రైతులు మళ్లీ సవ్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతారు. దీనివల్ల దేశంలోని ప్రజలకు ఆహారం దొరుకుంతుంది.
* దేశ ప్రజల శ్రేయస్సు కోసమేనా తాము సూచించిన అంశాలపై కేంద్రం దృష్టి సారించి స్పందించాలని ముఖ్యమంత్రులంతా కోరారు.