శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (12:33 IST)

మణిపూర్ ఐరన్ లేడీ షర్మిలని విడుదల చేయండి: సెషన్స్ కోర్టు

ఆత్మహత్యాయత్నం నేరం కింద అరెస్టు చేసిన మణిపూర్ పౌర హక్కుల మహిళా నేత ఇరోమ్ షర్మిల చానును తక్షణం విడుదల చేయాలని స్థానిక సెషన్స్‌ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ రాష్ట్రంలో అమలులో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ మణిపూర్ ఐరన్ లేడీగా ఇరోమ్ గత 14 ఏళ్లగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. 
 
అయితే, దీక్ష విరమింపజేసేందుకు ఆమెపై మణిపూర్ పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసును బనాయించి జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే సెక్షన్ 309 కింద ఆమెపై మోపిన ఆత్మహత్యాయత్నం ఆరోపణలు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. జుడీషియల్ కస్టడీలో ఉన్న షర్మిలను తక్షణం విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇరోమ్ షర్మిల విషయంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును కోర్టు తప్పుపట్టింది.