శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (11:10 IST)

జయలలిత వేలిముద్ర ఇష్యూ- లక్కానీకి సమన్లు.. అపోలో వ్యవహారం బయటపడుతుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్ర వ్యవహారంలో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీకి హైకోర్టు సమన్లు జారీ చేసింది. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం ఎమ్మెల్యే బోస్ గెలుపును వ్యతిరేకిస్తూ డీఎంకే అభ్యర్థి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్ర వ్యవహారంలో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీకి హైకోర్టు సమన్లు జారీ చేసింది. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం ఎమ్మెల్యే బోస్ గెలుపును వ్యతిరేకిస్తూ డీఎంకే అభ్యర్థి పెట్టిన కేసులో రాజేష్ లక్కానీ జోక్యం చేసుకుని జయలలిత వేలిముద్రలకు సంబంధించిన అంశంపై సరైన ఆధారాలను ఈ నెల 24వ తేదీలోపు సమర్పించాల్సిందిగా చెన్నై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపొందిన అన్నాడీఎంకే శీనివేలు శాసనసభ అభ్యర్థిగా బాధ్యతలు చేపట్టకముందే అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నియోజకవర్గానికి శీనివేలు మృతితో ఉపఎన్నికలు జరిగే సమయానికి జయలలిత ఆస్పత్రిలో వున్నారు. ఆ సమయంలో పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి చిహ్నం కేటాయించేందుకు పార్టీ అధినేత్రి, సంతకం పెట్టాల్సి వుంటుంది.  
 
కానీ ఆ సమయంలో అమ్మ సంతకం చేయలేని స్థితిలో ఆస్పత్రిలో ఉండగా, సంతకానికి బదులు ఎన్నికల సంఘం అనుమతితో వేలిముద్రలు తీసుకోవడం జరిగింది. దీంతో రెండాకుల చిహ్నాన్ని బోస్‌కు ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ చిహ్నంపై బోస్ గెలుపొందారు. కానీ బోస్ గెలుపుకు వ్యతిరేకంగా డీఎంకే అభ్యర్థి శరవణన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
ఈ పిటిషన్‌లో జయలలిత వేలిముద్రలను అక్రమంగా పొందినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీ కోర్టులో హాజరై.. బోస్ ఎన్నికల నామినేషన్, జయలలిత వేలిముద్రలతో పాటు 22 ఆధారాలను సమర్పించాలని కోర్టు వెల్లడించింది. కాగా 24న కోర్టులో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీ సమర్పించే ఆధారాల్లో అపోలో వ్యవహారం ఏదైనా బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా జయలలిత మరణం గురించి ఏదైనా విషయాలు వెలువడే ఆస్కారం ఉన్నట్లు సమాచారం.